calender_icon.png 27 October, 2024 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అటవీ అనుమతులు లేక పనులు ఆగాయి

27-10-2024 12:00:00 AM

  1. పెండింగ్‌లో 31 రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు 
  2. జాప్యంతో కొత్త రోడ్లు అడగలేకున్నాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  3. ఫాస్ట్‌ట్రాక్ విధానంలో అనుమతులొచ్చేలా చూస్తాం: మంత్రి కొండా- సురేఖ

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): అటవీశాఖ అనుమతులు లేక రోడ్ల నిర్మాణ పనులు ఆగిపోతే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం సచివాలయంలో ఆర్‌అండ్‌బీ మంత్రి చాంబర్‌లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి అటవీ అనుమతులపై సమీక్ష నిర్వహించారు. 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని కోమటిరెడ్డి తెలిపారు. ఐదేండ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్‌లో ఉంటే అధికారులు ఏం చేస్తు న్నారని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ర్ట ప్రగతికి ప్రతిబంధకంగా మారిందన్నారు. అటవీ అనుమతుల సాధనను పర్యవేక్షించేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఎస్‌ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కొండా సురేఖకు తెలిపారు. 

ఫాస్ట్‌ట్రాక్ విధానంలో అనుమతులు..

డీఎఫ్‌ఓల స్థాయిలో ఉన్న 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్‌లో అనవసర జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి ఆమె హామీ ఇచ్చారు.

అటవీ అనుమతులను వేగంగా సాధించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్‌కు ఆదేశాలు జారీ చేశారు. తన కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న 4 రోడ్డు ప్రాజెక్టు పనులకు సంబంధించిన అటవీశాఖ అనుమతుల ఫైళ్లను ఈ రోజే క్లియర్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. 

త్రినాథ్ రావు తీరుపై మంత్రుల ఆవేదన..

రాష్ట్రానికి సంబంధించిన రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ శాఖ రీజినల్ అధికారి త్రినాథరావు అనుమతుల ఫైళ్లలో చిన్నచిన్న అంశాలపై వివరణలు అడుగుతూ కాలయాపన చేస్తున్నారని సమావేశంలో ఇరువురు మంత్రులు ఆవేదన వ్యక్తంచేశారు.

అంతకు ముందు ఉప్పల్ ఎలివేటేడ్ కారిడార్ పై జరిగిన సమీక్షలో డిసెంబర్ నాటికి ఒక స్లాబ్‌ను పూర్తి చేయాలని జాతీ య ఉపరితల రవాణా శాఖ ఆర్‌ఓ కృష్ణప్రసాద్, ఎస్‌ఈ ధర్మారెడ్డికి సూచించారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్ తదితరులు పాల్గొన్నారు.