calender_icon.png 7 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవికి నిప్పు వన్యప్రాణులకు ముప్పు

01-12-2024 05:05:21 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అడవికి నిప్పు పెట్టడం వల్ల వన్యప్రాణులకు ముప్పు కలుగుతుందని వావుదాం బీట్ అధికారి అమరేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని గంటలగూడెం, కాప్రి, బనారు గొంది గ్రామాల ప్రజలకు అడవికి నిప్పు పర్యావరణ ముప్పు, అటవీ జంతువుల సంరక్షణపై అవగాహన కల్పించి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలం నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు వెళ్లే పశువుల కాపరులు నిప్పు వెలిగించకూడదన్నారు. అటవీ ప్రాంతం కాలుతే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. గిరిజనులకు గతంలో ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నంత వరకు మాత్రమే భూమి సాగు చేసుకోవాలని తెలిపారు. అడవిలో దొరికే ఇప్ప పువ్వు ఇతర పండ్ల సేకరణ ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అటవీ సంరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు. అక్రమ కలప తరలించకుండా ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమంగా కలప తరలిస్తే అటవీ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. అటవీ ప్రాంతంలో అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వావుదాం గ్రామ మాజీ సర్పంచ్ కీర్తనరావు, ఆయా గ్రామాల పటేళ్లు ఆత్రం రాజు, ఆత్రం భీము, బనార్ గొంది విఎస్ఎస్ అధ్యక్షుడు టేకం రాజు పాల్గొన్నారు.