calender_icon.png 5 March, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ శాఖ భూమిపై స్పష్టత ఇవ్వాలి

04-03-2025 09:06:54 PM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..

ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ కలాన్ 201/1 సర్వేనెంబర్ లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని గుర్రంగూడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి లేఖ రాశారు. ఫారెస్ట్ అధికారులు లేఖ ఇవ్వడంతో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని కాలనీవాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి, సమస్యను వివరించి, ఫారెస్ట్ ల్యాండ్ పై స్పష్టత ఇవ్వాలని కోరారు. సాహెబ్ నగర్ కలాన్ లోని భూమి అటవీశాఖది కాదని, గతంలో హుడా లేఔట్ కోసం 77 ఎకరాలకు అటవీ శాఖ అధికారులు ఎన్వోసీ ఇచ్చారని, దీంతో పాటు 118 జీవో ప్రకారం స్థానికులకు కన్వీనియన్స్ డీడ్ ఇచ్చారని వివరించారు.

రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ఇందులో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల నాయకులను తీసుకొని సైఫాబాద్ లోని అరణ్యభవన్ లో జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డిని కలిసి సమస్య వివరించారు. సమస్య తీవ్రతను గుర్తించిన డీఎఫ్వో సానుకూలంగా స్పందించి, రిజిస్ట్రేషన్స్ పునరుద్ధరణకు కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాస్తానని, కొద్దిరోజులోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎవరూ  ఆందోళన పడాల్సిన అవసరం లేదని, 201/1 సర్వే నెంబర్లలోని బీఎన్ రెడ్డినగర్, ఎస్ కేడీ నగర్, శ్రీరామనగర్, బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్-3 కాలనీలకు కోర్టు కేసు వర్తించదని, కేవలం 102 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ పైనే ప్రైవేట్ వ్యక్తులు కేసు వేశారని తెలిపారు.

కేసు వేయడంతో ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా రిజిస్ట్రేషన్ చేయవద్దని సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాశారని వివరించారు. 102 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు నిలిపి వేసి, మిగతా కాలనీల్లో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని డీ ఎఫ్ వో ను కోరారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, పుకార్లు నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, బీఎన్ రెడ్డినగర్ కాలనీ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, సెక్రటరీ ధనరాజ్, ఎస్ కేడీ నగర్ కాలనీ సంఘం గౌరవాధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, సెక్రటరీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.