టెక్నికల్ అప్రూవల్ వచ్చిన వెంటనే పనులు
ఇప్పటిదాకి ౯౦ శాతం భూసేకరణ పూర్తి
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర అటవీశాఖ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్ రావ్ భవర్ నుంచి తమకు మంగళవారం సమాచారం అందిందని మంత్రి వెల్లడించారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పంపిన లేఖలో ఉత్తర భాగానికి ప్రధాన సమస్యగా ఉన్న అటవీ భూములకు సంబంధించిన అనుమతులను ఇస్తున్నట్లు వెల్లడించారని పేర్కొన్నారు. అటవీ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జులై 26న పంపిన ప్రతిపాదనలను అటవీ సంరక్షణ చట్టం ప్రకారం రీజినల్ ఎంపవర్డ్ కమిటీ (ఆర్‌ఈసీ) అనుమతులను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఆర్‌ఈసీ అనుమ తుల ప్రకారం మెదక్ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, యాదాద్రి -భువనగిరి జిల్లాలో 8.511 హెక్టార్లు మొత్తంగా మూడు జిల్లాల్లో కలిపి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని భారత్‌మాల పరియోజన ఫేజ్- కింద ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ (పీఐయూ) హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (హెచ్‌ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి అనుమతించారని మంత్రి వివరించారు.
అటవీ అనుమతులకు లోబడి భూసేకరణ చేస్తామని పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. అటవీ అనుమతుల సమస్య తీరడంతో ఇక ఎన్‌హెచ్‌ఏఐ వద్ద పెండింగులో ఉన్న టెక్నికల్ అప్రూవల్ వస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటిదాకా 90 శాతం భూసేకరణ పూర్తయ్యిందని, కొన్ని చిన్న చిన్న కోర్టు కేసుల భూములను త్వరలో పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు అటవీ అనుమతులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.