* భూభరతి చట్టం.. ప్రతిఒక్కరికీ చుట్టం
* పేదోడి భూమికి భూభద్రత కల్పించడమే ధ్యేయం
* బీఆర్‌ఎస్ సభ్యులు సభలో గూండాల్లా వ్యవహరించారు..
* ధరణి అక్రమాలను మా దృష్టికి తీసుకురావాలి
* రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* భూభారతి చట్టానికి అసెంబ్లీలో ఆమోదం
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): భూభరతి చట్టం ప్రతిఒక్కరికీ చుట్టమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ధరణి ముసుగులో జరిగిన భూ దోపిడీ, అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆర్‌ఓఆర్ బిల్లు భూభారతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. భూభారతిప్రజలకు మేలు చేసే నిజమైన ప్రజాచట్టమని కొనియాడారు. గుంట భూమి ఉన్న రైతు కూడా చట్టం కోసం ఆసక్తిగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, బిల్లును సభలో ప్రవేశపెట్టకుండా బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవడంపై పొంగులేటి ఫైర్ అయ్యారు. గుండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్‌పైనా , కాంగ్రెస్ సభ్యులపైనా కాగితాలు విసరడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్ నేతలు సృష్టించిన గందరగోళం తర్వాత బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అసెంబ్లీలో రోజుకో వేషంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రతిచోట ధరణి తెచ్చిన భూ సమస్యలు ఉన్నాయన్నారు. ధరణిలో తన భూమి తాను చూసు కొనే వీల్లేదని, ఆనాడు అంతా రహస్యమేనని, తమ ప్రభుత్వంలో దొరలు, సామా న్యులకు ఒకటే విధానమని, భూభారతిలో అంతా పారదర్శకమే అన్నారు. ఈ రోజుతో ధరణిని బంగాళాఖాతంలో వేసినట్లు స్పష్టం చేశారు. గత పాలకుల హయాంలో పదేళ్లు రాష్ర్టం ధృతరాష్ర్ట కౌగిలిలో చిక్కుకుందని, ఓ పెద్దమనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అ న్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందినాడికల్లా దోచుకున్నారు..
తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు.. ఆ తర్వాత వేట కుక్కల్లా అందినాడికల్లా దోచుకున్నారని మంత్రి మండిపడ్డారు. తమ ప్రభుత్వం పేదోళ్లకు మేలు జరిగేలా భూభారతి చట్టాన్ని రూపొందిచామన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన రెవె న్యూ చట్టాలు, సంస్కరణలు రైతాంగానికే కా కుండా యావత్తు ప్రజానీకానికి ఎంతో మేలు చేశాయన్నారు. తమ సర్కారు కూడా నిబద్ధతతో భూభారతి 2024 రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. దేశచరిత్రలో కీలకమైన రైతు సంస్కరణలు తీసు కొచ్చిన ముగ్గురూ తెలంగాణ వారే అని మంత్రి కొనియాడారు. భూకమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి సీఎం పీవీ నరసిం హారావు, కౌలు రైతులకు మేలు చేసే విధం గా రక్షిత కౌలుదారి చట్టాన్ని బూర్గుల రామకృష్ణారావు, జాగీర్ల రద్దులో కీలకంగా వ్యవ హరించిన మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి స్ఫూర్తితో ఈ కొత్త రెవె న్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు.
మంత్రి పొంగులేటికి అభినందనలు
భూభారతి బిల్లు శుక్రవారం అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో మంత్రి పొంగులేటి కొంత ఉద్వేగానికి లోనయ్యారు. బిల్లును సమర్థంగా రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు గాను మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభ్యులు శాసనసభలో మంత్రి పొంగులేటితో పాటు రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు.
బేసిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే: మంత్రి పొంగులేటి
ధరణి ద్వారా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై అధ్యయనం చేయిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత అక్రమాలపై విచారణ చేపడతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూదోపిడీకి సంబంధించిన వివరాలేమైనా ఉంటే తమకు ఇవ్వొచ్చని బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ధరణికి మూడేళ్లకే నూరేళ్లు నిండాయి..
80 వేలకు పైగా పుస్తకాలు చదివానని చెప్పుకొంటున్న నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతమైన రెవెన్యూ చట్టం వస్తుం దని తాను భావించానని, కానీ.. ఆయన లోపభూయిష్టమైన రెవెన్యూ చట్టాన్ని తెలంగాణపై రుద్దారని మండిపడ్డారు. ఆ చట్టం భూయజమానులను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలకు కారణమైందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన రైతు మద్దెల కృష్ణయ్య (73) ధరణి ద్వారా సమస్యలకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని గుర్తుచేశారు. ప్రజాకంటకమైన ధరణికి మూడేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణలో గానీ రెండు సార్లు మాత్రమే రెవెన్యూ సవరణ చట్టాలు అమలులోకి వచ్చాయని గుర్తుచేశారు. మూ డోసారి తాను రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు జరగడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.