calender_icon.png 17 January, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన

17-01-2025 12:29:38 AM

  1. బయల్దేరిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు బృందం
  2. సింగపూర్‌లో నేటి నుంచి మూడు రోజులు 
  3. 20 నుంచి 23 వరకు దావోస్ టూర్
  4. ‘డబ్ల్యూఈవో’ సదస్సుకు హాజరు

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఆరు రోజుల విదేశీ పర్యటనకు ప్లాన్ చేసింది. గురువారం రాత్రి ఈ మేరకు సీఎంతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సింగపూర్‌కు బయల్దేరివెళ్లారు.

బృందం శుక్రవారం నుంచి ఆదివారం వరకు సింగపూర్‌లో ఉండి పలు విదేశీ కంపెనీల ప్రతినిధులతో భేటి కానున్నారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించనున్నది. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐటీఈ)ను సందర్శించను న్నది. ఆ క్యాంపస్‌లో కోర్సులు, యాజమా న్యం అనుసరిస్తున్న విద్యా విధానాలపై అధ్యయనం చేయనున్నది.

రాష్ట్రంలో ఏర్పాటయ్యే ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’కి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకోనున్నది. అలాగే సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న రివర్ ఫ్రంట్ విధానాలను పరిశీలించనున్నది. అనంతరం బృం దం 20 నుంచి 22వ తేదీ వరకు దావోస్‌లో పర్యటించనున్నది. ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు హాజరుకానున్నది. గతేడాది దావోస్ పర్యటనతో రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఈసారి అంతకుమించిన పెట్టుబడులు సాధించాలని సీఎం బృందం టార్గెట్ పెట్టుకున్నది.

హైదరాబాద్‌ను చూపిస్తూ..

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ)లో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఐటీ, ఏఐ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు విరివిగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. దీంతో పెద్ద కంపెనీలను ఈ విధానం ఆకర్షిస్తున్నది. అలాగే హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, వరల్డ్ క్లాస్ సిటీ, గ్రేటర్ సిటీలో ఎలివేటేడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు సైతం  ప్రత్యేక ఆకర్షణగా నిలు స్తున్నాయి.

వీటన్నింటినీ చూపిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే దావోస్, అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చారు. గతేడాది కంటే ఈసారి మరిన్ని ఎక్కువ పెట్టుబడులు వస్తాయని సీఎం, మంత్రి, అధికారుల బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.