calender_icon.png 17 October, 2024 | 11:03 AM

కొత్త రికార్డుస్థాయికి విదేశీ మారక నిల్వలు

28-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు సరికొత్త రికార్డు గరిష్ఠస్థాయికి చేరాయి.  శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాం కాల ప్రకారం  సెప్టెంబర్ 20తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 2.838 బిలియన్ డాలర్లు పెరిగి 692.296 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరాయి. 

విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.057 బిలియన్ డాలర్లు పెరిగి 605.686 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

పెరిగిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో  726 మిలియన్ డాలర్లు పెరిగి 63.613  బిలియన్ డాలర్లకు చేరాయి.  స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 121 మిలియన్ డాలర్లు పెరిగి18.54 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 66 మిలియన్ డాలర్లు  తగ్గి 4.458 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.