నిందితుడి వద్ద నుండి ఓజి కుష్ 170 గ్రాములు,1 కిలో డ్రై గంజాయి స్వాధీనం...
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): అదనపు ఆదాయం కోసం ఏకంగా గంజాయిని విక్రయిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడగా, మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గచ్చిబౌలి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శివరాం (28)ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 170 గ్రాముల ఓజీ కుష్ ఆయిల్, 1 కిలో డ్రై గంజాయి, ఒక బజాజ్ పల్సర్ బైక్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అతనిని విచారించగా బెంగళూరు డిలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నానని, ప్రతీవారం బెంగళూరు నుండి నగరానికి వచ్చి అవసరమైన వారికి గ్రాము గంజాయి రూ.3 వేలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. ఇతనితో పాటు బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అజయ్ కర్రా అక్కడి నుండి తప్పించుకున్నాడు. కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.