calender_icon.png 16 March, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందుచూపు

16-12-2024 12:00:00 AM

ఒక నిగూఢ అభినవం

ఒక నిర్వికార అభినయం

ఏ మాత్రం సంతృప్తి నివ్వక

హృదయ కుహరాలను తొలవటం చూసాక

ప్రతీ చేరదీత..ఇప్పుడు

స్వార్థాన్ని కప్పుకున్న ఆలింగనంలా 

కనిపిస్తోంది గతమంతా....

కుత్సితాలూ కుతంత్రాలూ లేని

మానవతా సుగంధాల మధ్య

రంగుల సీతాకోకలా తిరుగుతూ

పూల పుప్పొడులను 

తీయగా ఆస్వాదిస్తూ వుండొచ్చు...

ఎవరూ ఎవరికీ ఏమీ కారు అని తెలిసాక

స్వచ్ఛందంగా మనసు కవాటాలు తెరుచుకోవాలి

బోధివృక్షం కింద

బుద్ధుడు చెప్పిన మాటలు

కొట్టి పడేయలేని సత్యాలనీ మనల్ని తట్టేసరికే 

మనం అంటి పెట్టుకున్న కాలం

ఎంత ఒలికి పోయిందో...

మీ ఇంటికొస్తే ఏమిస్తావూ..

మా ఇంటికొస్తే ఏం తెస్తావూ.. అంటూ

పెలుసులు పెలుసులుగా రాలిపోతూ 

పొడిపొడిగా మాట్లాడుకునే బంధాలమధ్య

పచ్చని అంకురం ఒకటి అంటు కట్టుకోవాలి

ఇంటింటా తులసిమొక్కలా

మర్మం లేని మాటల చెట్టొకటి మొలవాలి

క్షణాల గొలుసు ముడులను లెక్కిస్తూ

ఎంత దూరం ప్రయానిస్తాం....

ఏదో ఒక ఘడియన 

ఈ బతుకు ముడి విడిపోక తప్పదు

ఆకాశానికి నిచ్చెన వేసి

భూమ్మీద నూకల్ని జారవిడుచు కోవద్దు

మూలాలు తెలవని వాడు

వర్తమానాన్ని పోగొట్టుకుంటాడు 

అబద్దాల గోడలపై కట్టే

ఏ సుందర సౌధమూ నిలబడదు

నిన్ను ఆత్మీయంగా హత్తుకోవటానికి 

ఒక్క ఎద చోటివ్వనప్పుడు

చలనమున్న నీ దేహం.. జ్వలించే మనసూ

ఒట్టి డొల్ల అని గ్రహించూ...

బుల్లెట్ బండి డుగ్‌డుగ్ శబ్దంలా 

గుండె బరువెక్కి కొట్టుకోవటం నీకు తెలుసా..

ఎర్రగా, అందంగా పూసిన మందారం

రాత్రికి రాలిపోవటం నీకు తెలియదా...

అన్నీ కూడేసుకుని కుప్పేసుకుని 

చెబుతానంటే కుదర్డు 

జీవితమంతా నిన్ను నీవు రూఢి చేసుకుంటుండాలి 

వివిప్యాట్ స్లిప్‌లా ఎప్పటికప్పుడు

నిజ నిర్ధారణ చేస్తుండాలి.. అది అంతే 

ఎన్ని గుణపాఠాలు గుండెను గుచ్చినా

నడవడికలు మారని నత్తలా ఎంతకాలం

నీరైనా...కన్నీరైనా...

దాహానికీ దుఃఖానికీ చెరువైనప్పుడే

వాటి విలువలు వలువలు తొడుక్కుంటాయి

భగ్గుమనే ఎండలమధ్య వర్షపు జల్లు ముద్దాడినట్టు

కష్టాల కొలిమిలో ఓ పలకరింపే ఊరట

వాస్తవాలను గ్రహించేసరికి

అచేతనావస్థ బోరున విలపిస్తుంది 

సెల్లులోనూ.. దిల్లులోనూ అప్‌డేట్ అవుతుండాలి 

నీ కోసం ఏదీ ఉన్నచోటే నిలబడదూ..

కదలటం, ప్రవహించటం జీవనది లక్షణం

కాస్త ముందుకు కదులు ముందుచూపుతో కదులు!

 


 డా. కటుకోఝ్వల రమేష్