సీఎం రేవంత్‌పై ఎంపీ ఈటల ధ్వజం
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పులిచర్ల పరిధిలో సుమారు 1,350 ఎకరాలతోపాటు మరో 1500 ఎకరాల భూమిని రాష్ర్ట ప్రభుత్వం బలవంతంగా సేకరించాలని కుట్రలు చేస్తున్నట్టు స్థానికులు భావిస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు.
రూ.40 లక్షల విలువైన భూమిని కేవలం రూ.10 లక్షలకే గుంజుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. స్థానికులు తమ గ్రామాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ రాష్ర్ట ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారన్నారు. సీఎం రేవంత్‌అహంకారంతో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కలెక్టర్‌ను పంపిస్తే ప్రజలు నిరసన తెలిపారని అన్నారు. స్వయాన కలెక్టరే తమపై దాడి చేయలేదని ప్రకటించినా.. 1500 మంది పోలీసులు 4 గ్రామాలపై పడి రాత్రికి రాత్రి కొంతమందిని అరెస్ట్ చేసి హింసించారని తెలిపారు.