చాలామంది ఆడవాళ్లకు ఇంటి పని, ఆఫీసు పని, బాధ్యతలతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉంటారు. ఇలాంటి జీవనశైలి వల్ల క్రమంగా అసహనం, ఆత్మన్యూనత పెరిగిపోతాయి. ఇలా కాకుండా ఉండాలంటే మీ కోసం మీరు సమయం కేటాయించుకోగలగాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగు తారు. దాని కోసం కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో చూసేయండి.
- ఉద్యోగం చేస్తున్నా, గృహిణిగా ఉన్నా చేసే పనిని ప్రేమించండి. మీరు చేసే పనిని, మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. అప్పుడే అందులో మెళకువలు నేర్చుకొని ఆనందంగా ఉండగలుగుతారు.
- ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా అన్ని పనులు మీరే చెయ్యాలి అని మీద వేసుకోవద్దు, ఎవరి పనులు వారు చేసుకొనేలా అలవాటు చెయ్యాలి. అందర్నీ మెప్పించాలి అనుకుంటే ఒత్తిడి పెరిగిపోతుంది.
- వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల మధ్య స్పష్టమైన సరిహద్దుని గీసుకోవడం, ప్రాధాన్యతా క్రమంలో పని చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి.
- ఇవన్నీ ఒక్కరోజులో కుదరకపోవచ్చు. కానీ సాధ్యమే. ఈ క్రమంలో మీరు హాజరవ్వాల్సిన వేడుకలు, కుటుంబ సభ్యులతో గడపాల్సిన సందర్భాలు.. వంటి మధుర క్షణాలను దూరం చేసుకోవద్దు. ఇవి మీలో భద్రతను, భరోసాను పెంచుతాయి. ఒకవేళ అలా చేయలేదంటే అపరాధ భావన మిమ్మల్ని మరింతగా కుంగతీస్తుంది.