ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్
హైదరాబాద్, జులై 11 (విజయక్రాంతి): మహిళలను ఆర్థికంగా శక్తిమంతులుగా ప్రభుత్వం చేయబోతుందని ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ తెలిపారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా త్వరలోనే మహిళలకు రూ.2,500 ఇవ్వబోతున్నామని తెలిపారు. గురువారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున పేదలకు అందజేస్తామన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి కేసీఆర్ కుటుంబం అధికారాన్ని సంపాదించుకున్నదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల వరకు కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన తప్పులు ఎక్కడ బయటికి వస్తాయోని కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, కానీ నిజమైన విద్యార్థులు లైబ్రరీలో చదువుకుంటున్నారని తెలిపారు. కవితను జైలు నుంచి విడిపించుకోవడం కోసం బీజేపీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్‌ను బీఆర్‌ఎస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు.