- నగరాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
- 14 నగరాల్లో గ్రోత్‌హబ్‌ల ఏర్పాటు
- గృహ నిర్మాణాల కోసం తక్కువ వడ్డీకే రుణాలు, సబ్సిడీలు
న్యూఢిల్లీ, జూలై 23: 2024 కేంద్ర బడ్జెట్‌లో 30 లక్షల కంటే అధిక జనాభాగల 14 పెద్ద నగరాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. నగరాల సంతులిత అభివృద్ధికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. నగరాలను గ్రోత్‌హబ్‌లుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. “సెమీ అర్భన్ ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక, రవాణా పరంగా ఆయా నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి” అని పేర్కొన్నారు. బడ్జెట్‌లో అర్బన్ హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గృహ నిర్మాణాలు పెంచడమే లక్ష్యంగా వరాలు ప్రకటించారు.
వచ్చే ఐదేళ్లలో అర్బన్ హౌజింగ్ కోసం రూ. 2.2 లక్షల కోట్ల సహాయాన్ని, తక్కువ వడ్డీకే రుణాలు, రాయితీలను అందించనున్నట్లు ప్రకటించారు. కొన్ని నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అబివృద్ధికి ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పరిశ్రమ కార్మికుల కోసం డార్మిటరీ తరహా వసతితో కూడిన అద్దె గృహాలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడ్‌లో నిర్మించనున్నట్లు తెలిపారు. అద్దె గృహాల మార్కెట్‌లో విధివిధానాలు, నిబంధనలను తీసుకొస్తామని చెప్పారు. 100 పెద్ద నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి శుద్ది, వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం ప్రాజెక్టులను ప్రారంభిస్తామన్నారు. శుద్ధి చేసిన నీటిని ఇంటి అవసరాలకు, సమీపంలోని ట్యాంకుల్లో నింపడం కోసం ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.