శ్రుతాద్ధి ప్రజ్ఞోపజాయతే, ప్రజ్ఞాయా యోగః యోగాత్ ఆత్మవత్తేతి విద్యా సామర్థ్యమ్
(1 ఒక సంస్థ ఆశించిన ఫలితాలను సాధించేందుకు ఉన్నత స్థాయి నిర్వహణాధికారుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఉన్నతాధికారులను నేరుగా నియమించడం ఉత్తమమంటాడు చాణక్య. వారిలో ప్రజ్ఞ వెలుగుచూడాలనేది చాణక్యుల అభిప్రాయం. వివిధ శాస్త్రాల ఆధ్యయనం వల్ల ప్రజ్ఞ, ప్రజ్ఞవల్ల యోగం, యోగం వల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోగలి గిన ఆత్మనిగ్రహం సాధ్యపడతాయని అంటాడు చాణ క్య. అలాంటి నిర్వాహణాధికారుల నాయకత్వంలో సిబ్బంది ఉత్సాహంగా పని చేస్తారు.
ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉన్నత నిర్వహణాధికారి నాయకు డు కానవసరం లేదు. చాలామంది ఉన్నతాధికారుల పనితీరును నిశితంగా గమనించినప్పుడు, వారి వ్యక్తిత్వాలు, వైఖరు లు, విలువలు, బలాలు, బలహీనతలు ఇతరులకు ప్రేరణనంగా కనిపిస్తాయి. చాలా తేలికైన వారుగా కనిపించినా నియంత్రించడంలో తిరుగు లేని వారుగా వ్యవహరిస్తారు.
దయ కలిగిన వారిగా కనిపించినా అవసరమైన చోట కచ్చితమైన రీతిలో ప్రవర్తిస్తారు. అలాంటి నిర్వాహణాధికారులు వారి బృందాన్ని సమర్థవంతంగా నడిపించేందుకు, ఆశించిన ఫలితాలను సాధించేందుకు, అవసరమైన నైపుణ్యాలను, లక్షణాలను, సాధనాలను కలిగి ఉం టారు. ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను కలిగిన ఉన్నతాధికారులు తమకేం కావాలో, ఎదుటివారి నుంచి ఏం ఆశిస్తున్నారో స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటారు. ఆ మేరకు అనుచరులకు చెప్పగలుగుతారు.
వ్యూహాత్మకంగా ఆలోచించడం, వైవిధ్యమైన ఆలోచనలను చేయడం, బృందాలకు ప్రేరణనివ్వడమే కాక వివిధ మానసిక చైతన్యాలను కలిగిన సిబ్బందిని ఒకే లక్ష్యం వైపు నడిపించే ప్రజ్ఞను కలిగి ఉంటారు. కార్యనిర్వహణలో సహజంగా తలెత్తే సమస్యలను సకాలంలో పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉండడం, అంతిమ నిర్ణయాలను ప్రతిభావంతంగా ప్రకటించడం.. వారి సహజ లక్షణంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వినియోగదారులతో బలమైన బంధాన్ని వారు ఏర్పరుచుకుంటారు.
ప్రాధాన్య క్రమంలో విధానాలు
ఆంతరంగిక సమావేశాలను కాలావధిలో నిర్వహించడం, ఒక్కొక్కరి పనితీరును పర్యవేక్షించడం, అవసర మైన సూచనలు, సలహాల ఇవ్వడం వల్ల అంచనాలపట్ల వారికి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. సరైన కార్యాన్ని, సరైన విధానంలో నిర్వహించడానికి వారు పాటించే కొన్ని విధానాలు పరిశీలించదగ్గవి. ఆశించిన ఫలితాలను అధిగమించడానికి ఏం చేయాలని సహచరులను ప్రశ్నిస్తూ వారి సహేతుకమైన సమాధానాలను వారు తీసుకుంటారు. దీంతో అవసరమైన సమాచారం వారికి అందుతుంది.
దానిని విశ్లేషించుకొని ప్రాధాన్యతా క్రమంలో అమర్చుకొని, కార్యాన్ని ఆవిష్కరిం చుకునే సౌలభ్యం కలుగుతుంది. ప్రాధాన్యతా క్రమంలో ఒక కార్యాన్ని నిర్వహించాక మరొక కార్యాన్ని చేపట్టినప్పుడు కూడా సహచరులను ‘ఏం చేయాలని’ ప్రశ్నించ డం వల్ల కొత్త ఆలోచనలు వెలుగు చూడవచ్చు. తిరిగి వాటి ప్రాధాన్యాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
అలాగే, ‘ఏది సంస్థ ప్రగతికి ఉపయుక్తమవుతుంది?’ అంటూ సహచరుల సలహాలను కోరుతారే కాని, అది సంస్థ వాటాదారులకుగానీ తనకు కాని ప్రయోజనకారియా అని ఏనాడూ ప్రశ్నించరు. సంస్థ ఉనికియే యాజమాన్య ఉనికికి, తమ ఉనికికి మూలమవుతుందే కాని తమకు ప్రయోజనకారిని ఎన్నుకోవడం సంస్థకు ప్రయోజనాన్ని కలిగించదు.
పటిష్టమైన ఆచరణ సాధ్యమైన కార్యాచరణ ప్రణాళికలను తయారుచేయడ మేకాక వాటిని సమర్థవంతంగా నిర్వహించే ప్రణాళికలను సమర్థులైన నిర్వాహకులు తయారుచేస్తారు. ప్రతి నిర్ణయాన్ని సహచరులతో బాధ్యతాయు తంగా పంచుకుంటారు.
జవాబుదారీతనంతో ఎవరి బాధ్యత ఏమిటనేది స్పష్టంగా సహచరులకు నివేదిస్తారు. సంస్థలో తలెత్తే సమస్యలపైకాక విస్తరణావ కాశాలపైనా దృష్టిని కేంద్రీకరించి నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలను పరిష్క రించడం అవసరమే కాని, అవి ఫలితా లను ఇవ్వవు. అవకాశాలను అంది పుచ్చుకుంటేనే ఫలితాలు ఆవిష్కృతమవుతాయి.
ప్రతి సమావే శాన్ని ఉత్పాదకతను పెంచుతూ ఫలితాన్ని సాధించే దిశగా మలుచుకుంటారు. అంతేకాని ఉబుసుపోని సమావేశంగా మారనివ్వరు. దీనివల్ల తమ సమాచారాన్ని ప్రభావవంతమైన కార్యాచరణ ప్రణాళికగా మార్చుకునే అవకాశమూ వారికి కలుగుతుంది. దానివల్ల అంతిమ ఫలితాలకు బృంద సభ్యులందరూ సమష్టిగా బాధ్యత వహించే ఉదాత్త సంస్కృతి వెలుగుచూస్తుంది.
సాఫల్య వైఫల్యాలకు సమాన బాధ్యత
క్రమశిక్షణ వ్యక్తి జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. దాన్ని పాటించడం వల్ల ప్రతి నిర్ణయంలోనూ కచ్చితత్వం, నిబద్ధత వెలుగు చూస్తాయి. ప్రతి నిర్ణయాన్ని అమలు చేయడంలో సమయ నియంత్రణను పాటించడం వల్ల ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోగలిగే ప్రజ్ఞ జాగృతమవుతుంది.
ప్రజ్ఞవల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా సాధించిన విజ్ఞానం ప్రభావవంతమైన క్రియాశీలతగా రూపాంతరం చెందుతుంది. పరిణతి చెందిన వ్యక్తిత్వం తమ నిర్ణయాలకు తామే పూర్తి బాధ్యతను తీసుకునేందుకు సహకరిస్తుంది.
ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నిర్వహణాధికారులు ఫలితాలు సాధించిన వేళ తమ గొప్పదనంగా ఫలితాల ను సాధించని వేళ కిందివారిపై నెట్టివేసే వైఖరిని ఏనాడూ ప్రదర్శించరు. అలాం టి ఉన్నతాధికారుల నిర్వహణలో సంస్థ ఉత్తమ ఫలితాలను సాధిస్తుంది. వినియోగదారులు, ప్రజల విశ్వసనీయతనూ చూరగొంటుంది.
పాలకుర్తి రామమూర్తి