30-03-2025 12:00:00 AM
ఒకప్పుడు ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా ఉండిన నేపాల్‌లో ఇప్పుడు రాచరిక వ్యవస్థను పునరుద్ధరించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. రెండు శతాబ్దాలకు పైగా నేపాల్‌ను షా వంశీకులే పాలించారు. అయితే మాజీ మావోయిస్టు తిరుగుబాటుదారులతో కుదిరిన ఒ ప్పందం ఫలితంగా 2008లో నేపాల్‌ను హిందూ రాజ్యంనుంచి లౌకిక సమాఖ్య గణతంత్ర రాజ్యంగా మారుస్తూ ప్రత్యేకంగా ఎన్నికైన జాతీయ అసెంబ్లీ 239 ఏళ్ల రాజరిక వ్యవస్థను రద్దు చేసింది. 1996నుంచి 2006 మధ్య కాలంలో మావోయిస్టుల తిరుగుబాటు కారణంగా 17 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
రాజ్యాంగ వ్యవస్థ అయితే రద్దయింది కానీ అప్పటినుంచి నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. బలహీన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, కొన్ని నెలల్లోనే కూలిపోవడం పరిపాటిగా మారిపోయింది. 2008నుంచి ఇప్పటివరకు 13 ప్రభుత్వాలు మారాయి. అయినా రాజకీయ స్థిరత్వం ఏర్పడలేదు. మరోవైపు నేతల్లో రాజకీయ అవినీతి పెచ్చుమీరింది. దీంతో దేశ ప్రజలలో ఇప్పటి ప్రభుత్వాలపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫిబ్రవరి19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా చిట్టచివరి రాజు జ్ఞానేంద్ర షా ప్రజలనుంచి మద్దతు కోరడం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది.
దీని తర్వాత దేశంలో ఆందోళనలు హిం సాత్మకంగా మారాయి. తాజాగా శుక్రవారం జరిగిన హింసలో ఒక జర్నలిస్టు సహా ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఆందోళనకారు లు దుకాణాలను దోచుకోవడంతో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టా రు. ఈ హింసాయుత ఘటనలకు జ్ఞానేంద్ర షానే కారణమని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని కేపీ ఓలి అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఖాట్మండులో చోటు చేసుకుంటున్న హింసాయు త ఘటనల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు కూడా.
అయితే నేపాలీ ప్రజలు తిరిగి రాజరిక వ్యవస్థను కోరుకోవడం వెనుక అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2001లో నేపాల్ రాజకుటుంబానికి చెందిన రాజు బీరేంద్ర, రాణి ఐశ్వర్య, ఆ కుటుంబానికి చెందిన మరో ఎనిమిది మంది దారుణంగా మూకుమ్మడి హత్యకు గురి కావడం ఆ దేశ చరిత్రలో పెద్ద మలుపు. యువరాజు దీపేంద్ర తాను కోరుకున్న యువతిని వివాహమాడడానికి కుటుంబం వ్యతిరేకత కాణంగా ఆగ్రహంతో అందరినీ చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో జ్ఞానేంద్ర షా నేపాల్‌కు రాజయ్యారు. అయితే నేరుగా ప్రభుత్వంపై కంట్రో ల్ సాధించడం కోసం 2005లో పార్లమెంటును రద్దు చేసి ఎమర్జెన్సీ విధించడమే ఆయన అధికారచ్యుతికి దారి తీసింది.
రాజరిక పాలనను ముగింపు పలకాలంటూ 2006 ఏప్రిల్‌లో ఏడు పార్టీల నేతృత్వంలో ‘జన ఆందోళన’ పేరుతో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఒత్తిడికి తలొగ్గిన జ్ఞానేంద్ర పార్లమెంటును పునరుద్ధరించారు. 2008లో పుష్పకుమార్ దహల్ ప్రచండ నేతృత్వంలోని మాజీ మావోయిస్టు తిరుగుబాటుదారుల ఆధిక్యత ఉన్న కొత్తగా ఎన్నికైన రాజ్యాంగ అసెంబ్లీ రాచరి క వ్యవస్థ రద్దుకు అనుకూలంగా ఓటు వేయడంతో నేపాల్ ఫెడరల్ ప్రజాస్వామ్య రిపబ్లిక్‌గా ఏర్పడింది. రాజరిక వ్యవస్థలో నేపాల్ ప్రజలు వాస్తవా నికి సుఖ సంతోషాలతోనే ఉండేవారని చెప్పాలి.
పాలకులు భారత ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు. అయితే మా వోయిస్టులు తిరుగుబాటు చేయడం మొదలైనప్పటినుంచీ దేశం పేదరికంలోకి జారుకుంది. అప్పటివరకు పర్యాటకులకు స్వర్గధామంగా ఉండిన నేపాల్ క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడంతో తిరిగి రాజరిక వ్యవస్థ రావాలన్న డిమాండ్ బలపడుతూ వచ్చింది. అదే ప్రస్తుత అశాంతికి దారితీసింది. జ్ఞానేంద్రకు పెరుగుతున్నమద్దతు తిరిగి రాచరిక వ్యవస్థ ఏర్పాటుకు దారి తీస్తుందా అన్న ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లేదు.