- కేసీఆర్ దీక్ష చేసిన చోట బహిరంగ సభ
- 29న దీక్షాదివస్ విజయవంతానికి సన్నాహాలు
కరీంనగర్, నవంబరు 22 (విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష చేసిన చోటనే బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షాదివస్ సభ విజయవంతానికి సన్నాహాలు చేస్తున్నారు. 2009 నవంబర్ 29న కరీంనగర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
తీగలగుట్టపల్లిలోని తన నివాసం వద్ద దీక్ష ప్రారంభించగా పోలీసులు భగ్నం చేశారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్‌ను జరుపుకుంటున్నది. ఈసారి కేసీఆర్ దీక్ష చేపట్టిన తీగలగుట్టపల్లి లేదా అల్గునూరు ప్రాంతంలో 29న దీక్షా దివస్ సభను విజయవంతం చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నేతలు ప్రయత్నం చేస్తున్నారు.
అందుకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దీక్ష చేపట్టిన అల్గునూరు చౌరస్తాను దీక్ష దివస్ చౌక్‌గా తీర్చిదిద్దుతామని అప్పటి పాలకులు ప్రకటించారు. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. కేవలం ఫౌంటెయిన్ నిర్మించి వదిలిపెట్టారు. ఇప్పుడు అదేచోట బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆలోచనకు వచ్చారు.