calender_icon.png 17 January, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ జన్మ కోసం..

09-08-2024 12:00:00 AM

గీతానం సప్తమాధ్యాయ మన్తరేణ సుధామయం   

జన్తోర్జరా మృత్యుదుఃఖ నిరాకరణ కారణమ్ ॥

సప్తమాధ్యాయ జపతోముక్తి బాజ్మోభవస్తతః  

దేవమిష్టతమం జ్ఞాత్యానిర్వాణార్పిత బుద్ధయః ॥

పూర్వం పాటలీపుత్రం అనే నగరంలో శంఖుకర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు బ్రాహ్మణ వృత్తిని వదిలి, ధనార్జనా తత్పరుడై నిరంతరం కాలం గడప సాగాడు. ఒకనాడు అతడు పక్క గ్రామానికి పయనమై పోతుండగా, మార్గమధ్యంలో పాముకాటుకు గురై మరణిస్తాడు. మరు జన్మలో సర్పమై పుట్టి, తాను ఇదివరకు భూమిలో దాచి ఉంచిన నిధిని రక్షించుకుంటూ ఉంటాడు. తన తండ్రి పొరుగూరు నుండి ఇంకా తిరిగి రాలేదని కొడుకు ఒక సిద్ధుని ఆశ్రయించి ‘జాడ తెలుపుమని’ కోరతాడు. 

సిద్ధుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని, “నాయనా! మీ తండ్రి ఎప్పుడో మరణించాడు. ఇప్పుడు ఆయన పాముగా పుట్టి నిధికి కాపలాగా ఉన్నాడు.” ఇలా చెప్పడమే కాదు, ఆ కుమారుని తీసుకొని పోయి ఆ ప్రాంతాన్నీ చూపించాడు. పుత్రుడు దుఃఖిస్తూ, “ఈ సర్ప జన్మనుండి మా తండ్రిని ఉద్ధరించుకొనే ఉపాయం ఏమిటి స్వామీ?” అని అడుగుతాడు. “శ్రద్ధతో నియమానుసారం ‘భగవద్గీత’లోని 7వ అధ్యాయాన్ని పారాయణం చెయ్యి. ఆ ఫలాన్ని మీ తండ్రికి ధారబోయాలి. అప్పుడు ఆయనకు ఉత్తమ జన్మ లభిస్తుంది” అంటాడు. సిద్ధుని మాట ప్రకారం పుత్రుడు అమృత పరిపూర్ణమైన గీతలోని ఏడవ అధ్యాయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పారాయణం చేసి, ఫలితాన్ని తండ్రికి ధార పోశాడు. వెంటనే శంఖుకర్ణుడు సర్ప జన్మాన్ని వదిలి దివ్యత్వాన్ని పొందాడు.

దుర్గతుల నివారణ

జమన్ గీతాష్టమాధ్యాయ శ్లోకార్థం నియతేన్ద్రియ  

సంతుష్టవా నహందేవి తదీయ తపసా భృశమ్ ॥

పూర్వం భావశర్మ అనేతడు భ్రష్టాచారుడై మరుజన్మలో తాడిచెట్టుగా పుట్టాడు. ఇదే విధంగా, కుమతి, కుషీవలుడు అనే దంపతులు దుష్కర్ములై బ్రహ్మ రాక్షసులైనారు. ఆ బ్రహ్మ రాక్షస దంపతులు ఒకనాడు ఆ తాడిచెట్టు నీడలో కూర్చున్నారు. 

అప్పుడు భార్య, “మనకు ఈ బ్రహ్మ రాక్షసత్వం ఎప్పుడు పోతుంది?” అని అడుగుతుంది భర్తను. “కర్మలను అధిగమించి, ఆధ్యాత్మిక బుద్ధితో బ్రహ్మాన్ని తెలుసుకోవడం ద్వారా పోతుంది” అన్నాడు. వెంటనే భార్య, “కింతద్రహ్మ! కింమధ్యాత్మం! కిమ్ కర్మ పురుషోత్తమ” అని ప్రశ్నించింది. ఆమె మామూలుగానే అడిగింది. కానీ, అది ‘భగవద్గీత’ 8వ అధ్యాయంలోని ప్రథమ శ్లోక పాదం. అంతే! ఆ ఉచ్చారణతోనే వారి బ్రహ్మరాక్షసత్వం పోయి నిజరూపాలను పొందారు. 

తాడిచెట్టుగా ఉన్న భావశర్మకూ యధారూపం లభించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన విమానంలో కుశీవల దంపతులు విమానం ఎక్కి దివ్య లోకానికి వెళ్లారు. భావశర్మ ‘గీత’ అష్టమాధ్యాయాన్ని రాసి పెట్టుకొని, కాశీ పట్టణానికి వెళ్లాడు. అక్కడ దానిని బాగా జపిస్తూ శ్రీ హరి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. విష్ణుమూర్తి అతని జపతపాలకు మెచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. 

- కలకుంట్ల జగదయ్య