calender_icon.png 31 March, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తె గెలుపు మాదే

29-03-2025 01:50:08 AM

  1. ఉపఎన్నికలొచ్చినా వికసించేది కమలమే
  2. బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు
  3. ఆర్బీఐ అప్పులిస్తేనే రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు
  4. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలొచ్చినా అన్ని చోట్లా విజయ ఢంకా మోగిస్తామన్నారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై జరిగే ఏ ఎన్నికల్లోనైనా తెలంగాణలో బీజేపీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ రెండూ కుటుంబ, అవినీతి పార్టీలేనని విమర్శించారు. ఏప్రిల్ లోపు తెలం గాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని తెలిపారు. అనుభవం సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని అధ్యక్ష ప్రకటన ఉం టుందన్నారు.

కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ పరిపాలనలో అవగాహన లేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు అమలు చేయలేక విపక్ష నేతలపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్  నాయకులు పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విభజన రాజకీయాలకు కాంగ్రెస్ తెరతీస్తుందని విమర్శించారు. కర్ణాటకలో మతపరమైన రిజర్వేషన్లకు తెరలేపారని మండిపడ్డారు.

అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారన్నారని చెప్పారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. బీసీలకు మొండిచేయి చూపుతూ ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలని చూస్తే ఊరుకోమని హెచ్చిరించారు. 

ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికే డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. ఆర్బీఐ నుంచి అప్పులు వస్తేగాని రాష్ర్టంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తకుండా బీఆర్‌ఎస్ వ్యతిగత దూషణలకు దిగిందని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి పాలన అందించే పరిస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారని అన్నారు.