పురుషులకు దీటుగా వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు ఈతరం మహిళలు. మూస పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. కొత్త కొత్త మెలకువలను దేశానికి పరిచయం చేస్తున్నారు. తాము ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే.. ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. విభిన్న, వినూత్న ఆలోచనలతో వ్యవసాయ రంగంపై తమదైన ముద్ర వేస్తున్న మహిళా రైతుల పరిచయం గురించి..
మహిళా రైతులకు రోల్ మాడల్
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమారి దేవిని ‘కిసాన్ చాచీ’ అని కూడా పిలుస్తారు. ఆమె తన జిల్లాలోని 19 గ్రామాల రైతులను పంటలపై అవగాహన పర్చడం, కొత్త వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడం, నేల నాణ్యతను అంచనా వేయడం, ఏ భూమిలో ఏ పంట వేయాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తోంది.
ఆమె నాయ కత్వంలో ముజఫర్‌పూర్‌లోని మూడు గ్రామ పంచాయతీలు సాంప్రదాయ గోధు మ-, వరి, -పొగాకుతోపాటు ఇతర కూరగాయలు, పండ్లు, చేపలు, కోళ్లు, ఆవుల పెంపకంలో విభిన్నంగా మారాయి. ఈ ప్రాంత మహిళల చేత వ్యవసాయం చేయించడమే కాకుండా, పూర్తిస్థాయి పారిశ్రా మికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు.
అలాగే తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన కూరగాయలు, పండ్లు, పచ్చళ్లు, జిలేబీలతో మార్కెటింగ్ చేస్తోంది. ఇవన్నీ ఢిల్లీ, ముంబై నగరాల్లో అమ్ముడుపోతున్నాయి. దీంతోపాటు 300 మందికిపైగా మహిళలు స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేసి ఆర్థికంగా నిలుదొక్కుకునేలా ప్రోత్సహించింది. వ్యవసాయ రంగంలో మహిళా రైతుల సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోందీమే.
-డ్రాగన్‌కు కేరాఫ్
కేరళలోని కొల్లంకు చెందిన రెమాభాయ్ ఎస్. శ్రీధరన్ 36 సంవత్సరాలపాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అయితే 2022లో ఆమె పదవీ విరమణ చేసిన తర్వాత వ్యవసాయ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఇతర దేశాల నుంచి ఖరీదైన పండ్లను దిగుమతి చేసుకోవడం వల్ల కేరళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని గ్రహించింది.
ఈక్రమంలో మామిడి, యాపిల్, నారింజ వంటి 40 విభిన్న పండ్లను అధ్యయనం చేసింది. అయితే ఆమెను ఎక్కువగా ఆకర్షించింది డ్రాగన్ ఫ్రూట్ . “డ్రాగన్ ఫ్రూట్ కేవలం ఒక పండు కాదు.. ఇది ఔషధం” అని అంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోనాలు ఉండటంతో డ్రాగన్‌ను పండిస్తోంది.
వ్యవసాయంలోకి దిగిన రెండేళ్లకే అద్భుత ఫలితాలను సాధించారు. ఒకవైపు పొలంలో, మరోవైపు ఇంటి టెర్రస్ డ్రాగన్ ను పండిస్తూ నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తోంది. ఇటీవలనే ఆమె ‘ఉత్తమ సేంద్రియ’ రైతు అవార్డును అందుకుంది కూడా.
ఆర్గానిక్ కిచెన్‌తో లాభాలు
ఎక్కువ పంటలు పండేందుకు చాలామంది రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. ఇది కొన్ని సంవత్సరాలకు ఎక్కువ పంటను ఇవ్వొచ్చు. కానీ క్రమంగా అది నేలలోని పోషకాలను నాశనం చేస్తుం ది. అంతేకాదు పర్యావరణం, రైతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పంజాబ్‌కు చెందిన బీబీ కమల్‌జీత్ కౌర్ ఆర్గానిక్ కిచెన్ గార్డెన్‌తో కూరగా యలు పండిస్తోంది.
ఆమె పంజాబ్‌లోని బర్నాలా జిల్లా నివాసి. ఆమె భర్త వ్యవసాయం చేస్తుంటాడు. అయితే తన కోసమే కాదు, సమాజం కోసం ఏదైనా చేయాలనుకుంది. సేంద్రియ వ్యవసాయంతో ఎన్నో గ్రామాల రూపురేఖలను మార్చివేసింది. సేంద్రియ వ్యవసాయం చేసేలా తనలాంటి మహిళలను ప్రేరేపించింది.
దాదాపు 20 గ్రామాల రైతులకు రసాయనాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఆమె ఫలితంగా నేడు రెండు వేల మంది మహిళా రైతులు సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం బీబీ కమల్‌జిత్ కౌర్ స్ఫూర్తితో ఎన్నో గ్రామాల రైతులు పురుగుల మందులు లేని కూరగాయలను పండిస్తుండటం విశేషం.
అగ్రికల్చర్ లెజెండ్
రైతు కుటుంబంలో జన్మించిన పాపమ్మాళ్ భూమిని మాత్రమే నమ్ముకుంది. వందేళ్లు పైబడినా.. నిరంతరం పొలం పనులు చేసి ఆదర్శంగా నిలిచింది. జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పతో చిన్నవయసులోనే వ్యవసాయంపై దృష్టి పెట్టింది. కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం మహిళలకు సేంద్రియ వ్యవసాయ పాఠాలు చెబుతోంది.
ఈ యూనివర్సిటీ ద్వారా ఎంతోమంది వ్యవసాయంపై పట్టు సాధించారు. అలాంటివారిలో పాపమ్మాళ్ ఒకరు. “సేంద్రియ వ్యవసా యం అనేది సమాజ సేవ లాంటిది. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా అరికట్టాలి. సేంద్రి య సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అనే లక్ష్యంతో ముందుకుసాగారు.
చిన్నప్పుడే ఆమె అమ్మనాన్న చనిపో యారు. పెళ్లున కొద్ది సంవత్సరాలకే భర్త కూడా చనిపోయాడు. వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల పొలం లో సేంద్రియ వ్యవసాయం చేసింది. ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం మిశ్రమాలను సేంద్రియ ఎరువుగా వాడింది. 70 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేసినా ఆమె ఎప్పుడూ అలసిపోలేదు.
ఆమె చేస్తున్న పనులను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతోనూ సత్కరించింది. జీవితం చివరదశలోనూ వ్యవసాయ చేసి ఆదర్శంగా నిలిచింది. అయితే ఇటీవలనే పాపమ్మాళ్ తుదిశ్వాస విడిచింది. భౌతికంగా దూరమైనా.. ఆమె పరిచయం చేసిన వ్యవసాయ పద్ధతులను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు.
పేద రైతులకు పెద్ద దిక్కు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కు చెందిన ఆత్రం పద్మా బాయి అనే మహిళా రైతుకు మూడు ఎకరాల పొలం ఉంది. ఆ భూమి పత్తి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉండేది. అయినా సాగు చేసి లాభాలు గడించింది. అయితే కొత్తగా ఏదైనా చేయా లనుకొని వ్యవసాయ పనిముట్లతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
పేద రైతులకు కోడవళ్లు, పారలు, పలుగులు, గడ్డపారలు లాంటి వ్యవసా య పనిముట్లను అందిస్తోంది. ఏన్నో ఏళ్లుగా తక్కువ ధరకే పనిమట్లను అందిస్తూ రైతులకు పెద్ద దిక్కుగా నిలిచింది. ఆ తర్వాత ఆమె సర్పంచ్ గానూ మారి గ్రామాభివృద్ధికి కృషి చేసింది.
కాంక్రీట్ రోడ్లు వేయడం, స్వచ్ఛమైన నీటిని అందించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, రిజర్వాయర్వాలను నిర్మించడం లాంటి అద్భుత పనులు చేసి ఆదర్శ మహిళాగా పేరు తెచ్చుకున్నారు. తోటి మహిళలు వ్యవసాయం రంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనప్పటికీ, పద్మ బాయి మాత్రం వెనుకడగు వేయలేదు. స్థిరమైన వ్యవసాయం చేస్తూ ఎంతోమంది స్పూర్తిగా నిలిచారు.