calender_icon.png 28 October, 2024 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీసుకున్న డబ్బు ఇవ్వమన్నందుకు..

28-10-2024 12:27:21 AM

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఘట్‌కేసర్, అక్టోబర్ 27: భర్తను మోసం చేసి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వటం ఇష్టంలేని భార్య ప్రియుడు, స్నేహితుడితో కలిసి అతడిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పోచారం మున్సిపాలిటీ సంస్కృతి టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న తుకారంగేట్‌కు చెందిన బజార్ రమేష్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.

అతడు నిహారికను 2018లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. తాను విప్రో కంపెనీలో పనిచేస్తు న్నానని, 15 నెలలుగా వేతనం రావటం లేదని దీంతో పాటు తనకు గూగుల్ కంపెనీలో జాబ్ వచ్చినందున జర్మనీ వెళ్లాల్సి ఉందని చెప్పి నిహారిక.. రమేష్ వద్ద రూ.2 కోట్ల 65 లక్షలు తీసుకుంది.

డబ్బులు తీసుకున్నప్పటి నుంచి బెంగుళూరులోనే ఉంటుండటంతో డబ్బుల విషయమై విచారణ చేసిన రమేష్ కుమార్‌కు భార్య నిహారిక మోసం చేసినట్లు గుర్తించి డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల వొత్తిడి పెంచాడు. భర్త చేస్తున్న వొత్తిడిని తట్టుకోలేని నిహారిక తన ప్రియుడు బెంగుళూరులోనే ఉంటున్న కడపకు చెందిన డాక్టర్ నిఖిల్ రెడ్డికి తెలిపింది.

మరో మిత్రుడు హర్యానాకు చెందిన రాణాతో కలిసి రమేష్‌కుమార్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసుకుని వీరు ముగ్గురు ఈనెల 4న సంస్కృతి టౌన్‌షిప్ చేరుకున్నారు. ఇంట్లోనే నలుగురు కలిసి మద్యం  సేవించి నీ వద్ద తీసుకున్న డబ్బులను వెంటనే తిరిగి ఇస్తామని ఉప్పల్ వద్దకు రావాలని కోరారు.

మద్యం మత్తులో ఉన్న రమేష్ కుమార్ తన బెంజ్ కారులోనే భార్య, ఆమె మిత్రులతో కలిసి పిర్జాదిగూడ కమాన్ స్పార్క్ హస్పిటల్ వెనుకాల ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం వెనుకాల కూర్చు న్న నిఖిల్ రెడ్డి, రాణాలు డ్రైవర్ సిట్లో కూర్చుని ఉన్న రమేష్ మెడకు తాడు బిగించి హత్య చేశారు.

అదే రాత్రి బయలు దేరి తెల్లవారు జామున కర్నాటక రాష్ట్రం కొడగు జిల్లా కేంద్రం శివారులోని కాఫీ తోటకు చేరుకున్నారు. డిక్కీలో ఉన్న శవాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుండి జారుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా శవాన్ని తరలించిన కారు నంబర్ ఆధారంగా శవం రమేష్ కుమార్‌దిగా గుర్తించారు.

అతని కాల్ డేటా ఆధారంగా నిహారిక, నిఖిల్ రెడ్డి, రాణాను గుర్తించి పారిపోయేందుకు యత్నిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం ఒప్పుకున్నారు. రమేశ్ కుమార్ హత్యకు పాల్పడిన నిందితులను విచారణ నిమిత్తం నగరానికి తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు.