calender_icon.png 24 October, 2024 | 12:09 AM

చల్లటి వాతావరణానికి.. హెల్తీ స్నాక్స్!

15-07-2024 12:05:00 AM

వాతావరణం మారింది.. వర్షాలు మొదలయ్యాయి. సీజనల్ కోల్డ్.. ఇంకా అనుబంధ సమస్యలు కూడా. ఇమ్యూనిటీ పుష్కలంగా ఉండడమే అన్నింటికీ పరిష్కారం. ఆహారంలో రుచికి తోడుగా ఆరోగ్యాన్ని జోడించాలి. రోజూ ఏదో ఒక ఆకు కూర తింటే ఆరోగ్యం పరిపూర్ణం. రోజూ ఆకు కూరలేనా.. అని పిల్లలు ముఖం చిట్లిస్తే.. పిల్లలు ఇష్టపడే కాంబినేషన్‌లతో వండి పెట్టండి.  

మునగ మఖానా..

కావాల్సినవి

పూల్ మఖానా-ఒక కప్పు, మునగాకు పొడి-ఒక చెంచా, నెయ్యి-రెండు చెంచాలు, ఛాట్ మసాలా-అర చెంచా, ఉప్పు రుచికి సరిపడా. 

తయారీ విధానం

ఒక పాత్రలో మఖానాను సన్నటి సెగ మీద వేయించాలి. నాలుగైదు నిమిషాలు గట్టిపడే వరకు వేగించాలి. వీటిని గిన్నెలోకి తీసి.. అదే పాత్రలో నెయ్యి, మనగాకు పొడి, ఛాట్ మసాలా, ఉప్పు వేయించిన పూల్ మఖానా వేసి.. నిమిషం వేయించి దించేయండి. ఇది వేడిగా ఉన్నప్పుడే కరకరలాడుతూ రుచిగా ఉంటుంది. తర్వాత తినాలనుకుంటే గాలి చొరబడని సీసాలో భద్రం చేయాలి.

మునగాకు థోరస్

కావాల్సినవి

మునగాకు-నాలుగు కప్పులు, కొబ్బరి తురుము-ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పు, ఉప్పు సరిపడా, ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి తరుగు-చెంచా చొప్పున, నూనె-రెండు చెంచాలు, ఎండుమిర్చి-మూడు, కరివేపాకు-రెండు రెబ్బలు.

తయారీ విధానం

మునగాకును కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి. మిక్సీ జార్‌లో కొబ్బరి తురుము, అర కప్పు ఉల్లిముక్కలు, పసుపు, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేయాలి. పాత్రలో నూనె వేడయ్యాక.. ఆవాలు వేయాలి. అవి చిటపట లాడుతున్నప్పుడు జీలకర్ర, కరివేపాకు, మిగిలిన ఉల్లిముక్కలను జోడించాలి. అవి కాస్త వేగాక.. మునగాకు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ.. పది నిమిషాల తర్వాత కొబ్బరి మిశ్రమం కలిపి మరో ఐదు నిమిషాల తర్వాత దించేస్తే.. ఘుమఘుమలాడే మునగాకు థోరస్ సిద్ధం.