కాలంతో సంబంధం లేకుండా పెదాలు పగలడం, పొడిబారడం సహజం. కానీ వానకాలం, శీతాకాలంలో సమస్య మరింత పెరుగుతుంది. అలాంటి సమస్యలున్నప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
* ఎప్పటికప్పుడు పెదాల మీద మృతకణాలను తొలగించుకోవాలి. అప్పుడే అవి తేమగా ఉంటాయి. దీనికోసం చెంచా పెట్రోలియం జెల్లీలో కాస్త చక్కెర కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. టూత్ బ్రష్‌పై కొద్దిగా చక్కెర వేసి పెదాలపై రుద్దినా చాలు.
* గుప్పెడు గులాబీరేకల్ని మెత్తగా చేసి.. కాస్త కొబ్బరి నూనె, బాదం నూనె చేర్చి.. పెదాలపై మృదువుగా రుద్దండి. అర్ధగంట ఆగి చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే.. వారం తిరిగే సరికి పెదాలపై నలుపుదనం పోతుంది.
* చెంచా చక్కెరలో కాస్త నిమ్మరసం, దాల్చిన చెక్కపొడి కలిపి పెదాలకు పూతగా వేయాలి. పావుగంటయ్యాక పాలతో తడుపుతూ, మృదువుగా రుద్దాలి. ఇలా తరచూ చేస్తుంటే మృతకణాలు తొలగి మృదువుగా మారతాయి.
* రెండు చెంచాల గులాబీ రేకలు పొడిలో కొద్దిగా చాక్లెట్ పొడి, చక్కెర, కొబ్బరి నూనె కలిపి పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే పెదాలు పగలకుండా ఉంటాయి.