లక్డీకపూల్ చాంప్స్ సీఏ అకాడమీలో లఘు చిత్రాల ప్రదర్శన
హైదరాబాద్ సిటీబ్యూ, ఆగస్టు 11 (విజయక్రాంతి): మార్పు కోసం మంచి సినిమా లను ఆదరించాలని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం ముందడుగు (కలకత్తా), మంచిసినిమా, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ సదర్న్ రీజియన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ట్రావెలింగ్ కలకత్తా పీపుల్ ఫిల్మ్ ఫెస్టివల్ సమర్పణలో ‘మార్పు కోసం మంచి సినిమా’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్డీకాపూల్ హరినగర్‌లోని చాంప్స్ సీఏ అకాడమీలో పలు లఘు చిత్రాలను ప్రదర్శించారు.
ఆయా సినిమాలను వీక్షించేందుకు వచ్చిన వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలాజీ మాట్లాడుతూ.. సినిమాను చూడటం ఎంత ముఖ్యమో వాటిపై చర్చించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. సినిమా తీయడం కోసం శ్రమించిన ప్రతీ ఒక్కరిని గౌరవించాలన్నారు. అశ్లీలత లేకుండా.. ప్రత్యామ్నాయ సినిమాలను కూడా తీయవచ్చని చెప్పారు. ఇప్పటికే ఇలాంటి సినిమాలను విజయనగరం, కర్నూల్‌లో ప్రదర్శించామన్నారు. ఈ కార్యక్ర మంలో నియాన్ లఘుచిత్రం దర్శకురాలు సాక్షిగులాటి, శివలక్ష్మి, దివికుమార్, మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.