calender_icon.png 27 November, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుట్‌పాత్ ఆక్రమణల ఉక్కుపాదం

27-11-2024 12:11:47 AM

  1. నగర సీపీ సీవీ ఆనంద్
  2. ఆపరేషన్ రోప్‌కు శ్రీకారం
  3. తొలిరోజు టోలిచౌకీలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్‌జామ్ అవడానికి కారణమ య్యే వాటిని గుర్తించి, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇందులో భాగంగా రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్‌స్ట్రాక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్) అనే కార్యక్రమానికి సిటీ ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. దీని ముఖ్య ఉద్దేశ్యం.. ఫుట్‌పాత్‌ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించడంతో పాటు రోడ్లపై ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్న వాహనదారులపై కొరడా ఝుళిపించడం.

ఇందులో భాగంగా తొలిరోజు మంగళవారం ఫిలింనగర్ ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి టోలిచౌకి మెజిస్టిక్ గార్డెన్ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఆయా పనులను హైదరాబాద్ సీపీ సీవీఆనంద్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్ పర్యవేక్షించారు. ఆ మార్గంలో ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను.. సిబ్బది క్రేన్లతో తొలగించారు.

నగరం అంతా విస్తరిస్తాం..

అనంతరం మెజెస్టిక్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినప్పటికీ ట్రాఫిక్ సమస్య తీరడంలేదన్నారు. వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నగరంలో రోడ్ల విస్తరణ మాత్రం పెరగడం లేదన్నారు.

దీనికి తోడు కొందరు చిరువ్యాపారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వలన పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవు తున్నారన్నారు. అందుకే ఆపరేషన్ రోప్‌ను చేపట్టాం. దీనిని నగరమంతటా విస్తరిస్తాం. అయితే కొందరు షాపు నిర్వాహకులు తమ షాపుల ముందు ఉన్న ఫుట్‌పాత్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని,  అలాగే కొందరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి మరీ కట్టడాలు చేపట్టి చిరువ్యా పారులకు అద్దెకి ఇస్తున్నారని.. అలాంటి కట్టడాలన్నిటినీ కూల్చివేస్తామని స్పష్టం చేశారు. 

అలాగే నగరంలో అనధికారికంగా సైరన్‌లు బిగించుకున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ ఆపరేషన్ పేరిట నెల రోజులు తనిఖీలు నిర్వహించి 1015 సైరన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఎమర్జెన్సీ వాహనాలు మినహా సైరన్‌ను వినియోగించడం నిషేధమని.. బంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.