26-03-2025 11:20:14 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలోని ప్రముఖ ఫేమస్ బేక్స్ కేక్ హౌస్‌లో కస్టమర్‌కు తీవ్ర అసంతృప్తి కలిగింది. అతను ఆర్డర్ చేసిన చికెన్ కార్న్స్లో పురుగు కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. కస్టమర్ తక్షణమే దీనిని బేకరీ నిర్వాహకులకు తెలియజేశాడు. అయితే, షాపు సిబ్బంది తగిన విధంగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదేవిధంగా, డిస్ట్రిబ్యూటర్‌కి సమాచారాన్ని చేరవేసినప్పటికీ, అతని వద్ద నుంచి కూడా సానుకూల స్పందన రాలేదని బాధితుడు తెలిపాడు. బాధితుడు వెంటనే వరల్డ్ వైస్ కన్జ్యూమర్ వైడ్ అండ్ ప్రొటెక్షన్ వారిని సంప్రదించగా వారు బేకరీకి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్య సమాధానమే వచ్చింది.
వెంటనే వరల్డ్ వైడ్ కన్జ్యూమర్ రైట్స్ వారు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆహార భద్రతా అధికారుల దృష్టికి ఇది తీసుకెళ్లాలని కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే ఇలాంటి సంఘటనలు పట్టించుకోకపోతే ప్రజారోగ్యంపై ప్రమాదకర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కూత వేటు దూరంలో కలెక్టరేట్ ఆఫీసు ఉన్నా భయం లేకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఫేమస్ బేక్స్ అండ్ కేక్ హౌస్ అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు షాపు నిర్వాహకులు “అంతో ఇంతో ముట్ట చెపుతాం” అంటూ తల పొగరుగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. వ్యాపార లాబీల ప్రభావం ఉందా? నిబంధనలు అమలు కావా? అనే ప్రశ్నలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. అధికారుల తదుపరి చర్యలు ఏంటో వేచిచూడాలి. అధికారులు దీనిపై సమగ్ర విచారణ చేసి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.