ఇమ్యూనిటీ.. ఇది మన ఆరోగ్యకరమైన జీవితానికి చాలా అవసరం. దీనికోసం మంచి అలవాట్లు, బ్యాలెన్‌స్డ్ డైట్, వ్యాయామం తప్పని సరి. ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు నిత్యం ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులు, లైఫ్ స్టుల్‌లోమార్పులు, కొత్త అలవాట్లకు మొగ్గు చూపడం వంటివి ఇమ్యూనిటీని ప్రభావితం చేస్తూ ఉంటాయి.
అందరూ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకుంటేనే రోగాల నుంచి బయటపడొచ్చు. అందుకు ఆరోగ్యకరమైన, ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలు మన డైలీ ఫుడ్‌లో భాగం చేసుకోవాలి. అలా అని అధిక మొత్తంలో తీసుకున్న విషయంగా మారే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
రోజంతా మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్యాలపాలవుతాం. ఈ విషయం తెలిసి కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అందులోనూ బ్రేక్ ఫాస్ట్ విషయానికొచ్చే సరికి చాలా ఆలస్యం చేస్తుంటారు.
ఉదయం చేసే టిఫి న్ రోజులో మొదటి భోజనం. ఇది కచ్చితంగా కడుపు నిండే లా ఉండాలి. ఎక్కువ గంటలు నిండుగా ఉంటేనే రోజంతా మ నం శక్తివంతంగా పని చేస్తాం. ముఖ్యంగా ఈ వానకాలంలో వ్యాధుల బారి న పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఉదయం రోగనిరోధ శక్తిని పెంచే ఈ ఫుడ్స్ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వానకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్, ఇన్ఫెక్షన్లు దాడితో అస్వస్థతకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మెరుగైన ఆహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకుని వ్యాధుల బారినపడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులతో మన రోగనిరోధక శక్తి బలహీనపడే అవకాశం ఉండడంతో జలుబు, ఫ్లూ, కడుపుబ్బ రం, డయేరియా వంటి జబ్బులు వచ్చే ప్రమా దం ఉంది.
ఇక పోషకాలతో కూడిన కొన్ని సూప ర్ ఫుడ్స్ ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నా రు. వర్షాకాలంలో ప్రధానంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే అల్లం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే జింజెరాల్ వంటి పదార్ధాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నిరోధిస్తాయి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే కర్‌కుమిన్ అనే పదార్ధం పసుపులో ఉండటంతో ఇది మన ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుందని న్యూట్రీషనిస్టులు చెబుతున్నారు. ఇక యాంటిమైక్రోబల్, యాం టీవైరల్ పదార్ధాలు కలిగిన వెల్లు ల్లి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వానకాలం లో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ విషయానికి వస్తే.. అల్లం, వెల్లుల్లి, పసుపు, సిట్రస్ పండ్లు, పెరు గు, బాదం, పాలకూ ర, గ్రీన్ టీ, పపాయ, మష్రూమ్స్.
డైట్‌తో పాటు ఎక్సర్‌సైజ్..
మనిషికి ఫుడ్ ఎంత ముఖ్యమో, ఎక్సర్‌సైజ్ కూడా అంతే ముఖ్యం. ఏ ఉద్యోగంలో ఉన్నా ఎక్సర్‌సైజ్ చేస్తే హెల్తీగా ఉండొచ్చు. రోజుకు మూడు పూటలా ఆహారం తీసుకున్నట్టే ఉదయం, సాయంత్రం సమయంలో ఎక్సర్‌సైజ్ చేయాలి.
ఆహారంతోనే రోగనిరోధక శక్తి..
మంచి ఆహారంతోనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందరినీ ఎంతగానో భయపెడుతున్న బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలన్నా, ఒకవేళ సోకినా మనం తీసుకునే ఫుడ్ విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఫుడ్ను తినాలి. పండ్లు, నట్స్, అన్నం, చపాతి, గుడ్లు ఇలా ఏది తినగలిగితే అది రోజువారి మెనూలో ఉండాలి. ముఖ్యంగా వేడిగా ఉండాలి. ప్రస్తుతం సీజన్ కూడా మారింతి. దానికి అనుగుణంగా ఆహారం మార్చుకోవాలి.
విటమిన్-డి..
విటమిన్ -డీ లోపం వానకాలంలో చాలా ఎక్కువగా ఎదురయ్యే సమస్య. సూర్యుడి కాంతి తక్కువగా ఉండటం వల్ల శరీరానికి తగినంత విటమిన్- డీ లభించదు. ఇది ఎక్కువ రోజులు కొనసాగితే విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. విటమిన్- డీ శరీరంలో కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి విటమిన్-డి లేకపోతే కాల్షియం కూడా తగినంత అందదు. అయితే విటమిన్- డీ లోపాన్ని నయం చేయడానికి కొన్ని పానీయాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుంటే.
హెర్బల్ టీలు: దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనైస్ వంటి సుగంధ ద్రవ్యాలు జోడించి తయారుచేసే హెర్బల్ టీలు విటమిన్- డీ లోపాన్ని భర్తీ చేయడంలో చక్కగా సహాయపడతాయి.
క్యారెట్ జ్యూస్: క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మంచివిగా పేర్కొనబడతాయి. క్యారెట్ల జ్యూస్ రోజూ తాగుతుంటే విటమిన్-డి లోపం నయం అవుతుంది. కేవలం విటమిన్-డి లోపాన్ని నయం చేయడమే కాదు.. శరీరాన్ని రిఫ్రెష్ చేయడంలో కూడా క్యారెట్ జ్యూస్ చక్కగా సహాయపడుతుంది.
ఫోర్టిఫైడ్ మిల్క్: సమతులాహారంలో పాలకు స్థానం ఉంది. ప్రతి రోజూ పాలు తీసుకుంటూ ఉంటే విటమిన్- డీ శరీరానికి అందుతుంది.
స్మూతీస్: స్మూతీస్ లో విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి. ఆకుకూర, పాలకూర, కూరగాయలతో స్మూతీస్ తయారుచేసుకుని తీసుకోవడం మంచిది.
ఫైబర్ ఫుడ్..
పైబర్ అధికంగా ఉండే పప్పు ధాన్యాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. పప్పు ధాన్యాలు తింటే పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పప్పు ధాన్యాల్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, ఆరోగ్యకర జీర్ణవ్యవస్ధకు ఊతమిస్తుంది. చియా గింజల్లో కూడా ఫైబర్ అధికంగా ఉండటంతో వీటిని తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు అధిక బరువు సమస్యను అధిగమించవచ్చు.
వీటిలో ఉండే ఫైబర్ షుగర్, కొలెస్ట్రాల్ రక్తంలోకి వెళ్లే ప్రక్రియ నిదానమవుతుంది. ఇది జీవక్రియల ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇక ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను చూసినట్టయితే.. ఓట్స్, పప్పు ధాన్యాలు, చియా సీడ్స్, అవకాడో, బెర్రీస్, బ్రకోలి, క్వినోవా, బాదం, స్వీట్ పొటాటో, యాపిల్.
సమతులాహారం అవసరం..
పోషకాలతో కూడిన నెయ్యిని సూపర్ ఫుడ్గా చెబుతుంటారు. అయితే మోతాదు మించితే మంచి ఆహారమైనా చెడుగా మారుతుంది. నెయ్యిని అధికంగా వేడి చేస్తే అనారోగ్యకర పదార్ధాలు పేరుకుపోయే ప్రమాదం ఉంది. నెయ్యిని డీప్ ఫ్రై చేయకుండా ఆహారం రుచి కోసం ఓ టేబుల్ స్పూన్ వాడటం మేలని, మితంగా దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక రోజువారీ ఆహారంలో భాగమైన రైస్ను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ప్రొటీన్, ఫైబర్తో బ్యాలెన్స్ చేసేలా చూసుకోవాలి. రైస్ను పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి జరిగే హాని ఏమీ లేదని చెప్పారు. ఇక ప్రో బయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే పచ్చళ్లను కూడా పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. వీటిలో సోడియం అధికంగా ఉండడంతో మితంగా తీసుకోవాలి.
ఇక కొబ్బరి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఇందులో ఉండే ఆరోగ్యకర కొవ్వలు, ఎంసీటీలు మంచివని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో పోషకాలు అధికంగా ఉన్నా క్యాలరీలు కూడా ఎక్కువే కావడంతో దీన్ని మితంగా తీసుకోవాలి. సమతులాహారంలో భాగంగా కొబ్బరిని పరిమిత మోతాదులో తీసుకుంటే చాలు. ఏ ఆహారం తీసుకున్నా అన్ని రకాల పోషకాలు ఉండేలా సమతులాహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఎక్కువగా తీసుకుంటే..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు, పోషకాలు అవసరమవుతాయి. అలాంటి వాటిలో విటమిన్-బి12 కూడా ఒకటి. శాకాహారంలో ఎక్కువగా లభించని, మాంసాహారంలో మాత్రమే ఎక్కువగా లభ్యమయ్యే విటమిన్- బీ1 శరీరంలో నాడీ వ్యవస్థకు, నరాల పనితీరుకు చాలా అవసరం. అయితే ఇది ఎక్కువగా మాంసాహారంలో లభించడంతో శాకాహారం తీసుకునేవారిలో విటమిన్- బీ 12 లోపం ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా చాలామంది విటమిన్- బీ12 లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. అయితే విటమిన్ బీ12 అవసరమైన దానికంటే ఎక్కువ శరీరంలోకి వెళ్లడం కూడా ప్రమాదమేనని ఆహార నిపుణులు అంటున్నారు. విటమిన్ -బీ12 శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. అయితే వయస్సు, తీసుకునే ఆహారం, శరీరంలో ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని విటమిన్- బీ12 ను తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా పెద్దలు రోజుకు 2.4 మి.గ్రా విటమిన్- బీ12 తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే అది ఆరోగ్యానికి సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం లేదా సప్లిమెంట్ కంటే ఇంజెక్షన్లు ఎక్కువగా తీసుకోవడం కారణంగా విటమిన్-బి12 శరీరంలోకి ఎక్కువగా వెళుతుంది.
నట్స్..
డ్రై ఫ్రూట్స్.. బాదం, జీడిపప్పు, ఇతర నట్స్ అన్నిటిలో పుష్కలంగా ప్రోటీన్స్, ఫైబర్ ఉంటాయి. అంతేకాదు.. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలుంటాయి. ఇవి బాడీని ఫిట్ గా ఉంచుతాయి. ఇందులో ఉంటే విటమిన్ ఈ, మాంగనీస్, మెగ్నీషియం, రిబోఫ్లావిన్, నియాసిన్ వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
సిట్రస్ పండ్లు..
నారింజ, నిమ్మ, ద్రాక్షపండ్లు.. ఇలా పుల్లటి పండ్లన్నీ సిట్రస్‌కి సంబంధించినవి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ఫ్లేవినాయిడ్స్ వంటి అనేక పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉఫయోగపడుతాయి. సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
పెరుగు
పెరుగులో.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం వంటి ఆరోగ్యవంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌లో పెరుగు చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలకు కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది. పెరుగులో ఉండే బి12 వల్ల గుండె జబ్బులు దరిచేరవు. ఇందులో ఉండే మంచి ప్రోబయోటిక్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. అనేక వైరల్ ఇన్ ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లి రోజుకు ఒకటి తింటే ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదంటారు పెద్దలు. ఇందులో ఔషధ గుణాలు అధికం. అందుకే ఉదయం తినే ఆహారంలో వెల్లుల్లిని అధికంగా చేర్చుకోండి. ఇందులో బ్యాక్టీరియాతో పోరాడడానికి అనేక పోషకాలుంటాయి. తక్కువ కేలరీలు ఉండే ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు, అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతాయి.
ఆకు కూరలు..
బచ్చలికూర, పాలకూర, కొత్తిమీర, కరివేపాకు.. ఇలాంటి పచ్చని ఆకుకూరలు పోషకాల శక్తి కేంద్రాలు. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో అధిక స్థాయిలో విటమిన్ సీ, కే, బీటా కెరోటిన్, ఫోలేట్, ఫైబర్స్.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు!
తలనొప్పి, మైకం, విరేచనాలు, చర్మం పై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, వాపు, జలదరింపు వంటి సమస్యలు అన్నీ విటమిన్ బీ12 ఎక్కువగా శరీరంలోకి వెళ్లడంతో జరుగుతాయి. అంతేకాదు.. విటమిన్- బీ12 శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శరీరంలో ఉంటే అనాపిలాక్సిస్ అనే అరుదైన, తీవ్రమైన అలెర్జీ సమస్యకు దారితీస్తుంది.
డైలీ ఫుడ్ మెనూ..
* రోజుకు మూడు సార్లు మంచి ఫుడ్ తీసుకోవడం. జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి.
* తినే తిండిలో విటమిన్- సీ, జింక్ ఉండాలి.
* నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా మంచి పోషకాలు కూడా ఉంటాయి.
* రోజూ గుడ్డు తినడం తప్పని సరి.
* రాగి జావ లేదా ఓట్స్, విటమిన్ బీ, పిండి పదార్థాలు ఉండేవి ఎక్కువగా తినాలి.
* నీళ్లు ఎక్కువగా తాగాలి. హైడ్రేషన్ ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకునేలా చేస్తుంది.
* బటర్ మిల్క్, ఓఆర్‌ఎస్, కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీలు ఆరోగ్యానికి మంచివి.
* ఏ పూటకు ఆ పూట తాజాగా వండిన ఆహారం తింటే మంచిది.
* పండ్లు, కూరగాయలు డైట్‌లో తప్పకుండా ఉండాలి.
* పాలకూర, టమాటా, బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవాలి.
* షుగర్, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్ల సూచనల ప్రకారం డైట్ తీసుకోవాలి.
* వ్యాయామం చేయాలి. వీలైతే తరచూ యోగాసనాలు వేయాలి.