calender_icon.png 24 October, 2024 | 5:50 PM

ఆహారం విషం!

09-08-2024 01:58:46 AM

  1. కుళ్లిన కూరగాయలు, గుడ్లు.. ముద్ద అన్నం!

అధ్వానంగా గురుకులాల్లో భోజనం

  1. నూనె లేని కూర.. కారం నీళ్ల చారు 
  2. అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్లు 
  3. తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు
  4. పట్టింపులేని అధికార యంత్రాంగం
  5. ‘విజయక్రాంతి’ పరిశీలనలో వెల్లడి 

కుళ్లిన గుడ్లు, నాసిరకం కూరగాయలు, పురుగులు పడ్డ బియ్యం, కారం నీళ్ల చారు.. ఇవీ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాలు.. వెరసి తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం నాసిరకంగానే ఉంటున్నది. అపరిశుభ్ర వాతావరణంలో వంట గదులు, స్వచ్ఛత లేని నీటి వినియోగం, పర్యవేక్షించాల్సిన అధికారుల పట్టింపులేనితనం విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. రుచిలేని ఆహారాన్ని తినలేక పలువురు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏదో ఒకదానితో సరిపెట్టుకుంటున్న విద్యార్థులు దవాఖాన పాలవుతున్నారు. గురువారం రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలల్లో ‘విజయక్రాంతి’ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలివి.          

విజయక్రాంతి నెట్‌వర్క్, ఆగస్టు ౮: రాష్ట్రంలోని దాదాపు అన్ని గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అక్క డ సరిపడా మౌలిక వసతులు లేక విద్యార్థులు అపసోపాలు పడుతున్నారు. విద్యార్థు లకు అందించే భోజనానికి సంబంధించి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో వంట గదులు, వంటకు వినియోగించే పాత్రలు పరిశుభ్రంగా లేకపోవడంతో అన్నం ముద్దలు ముద్దలుగా మారి తినలేకుండా ఉంటుంది. కుళ్లిన కూరగాయ లు, గుడ్లు, నీళ్లను మరిపించే సాంబారుతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పోషకాలు లేని ఆహారం తీసుకుంటుండటంతో విద్యార్థుల ఆరోగ్యం క్షీణించి అనా రోగ్యం పాలవుతున్నారు. 

మిర్యాలగూడలో ఉడికీ ఉడకని అన్నం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులకు అందిస్తు న్న భోజనం దారుణంగా ఉంది. ఉడికి ఉడకనట్టున్న అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్లు రం గు మారి కనిపించాయి. కూరల్లో వంట నూనె తక్కువగా వాడటం, సాంబారు నీళ్లమయంగా ఉండటంతో విద్యార్థులు తినేందుకు ఇబ్బందిపడ్డారు. అయితే, బిల్లులు సకాలం లో రాకపోవడంతో తక్కువ సరుకులతో ఎక్కువ మందికి వండాల్సి రావడంతో నాణ్యత లోపిస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.  

కామారెడ్డిలో దొడ్డన్నం.. నీళ్ల చారు

కామారెడ్డిలోని మైనార్టీ బాలుర గురుకులం, ఎల్లారెడ్డిలోని బీసీ జ్యోతిబాపూలే బాలుర గురుకులం, నిజాంసాగర్ మండ లం అచ్చంపేట బీసీ బాలుర గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు గడ్డలు గడ్డలుగా ఉన్న అన్నం.. కారం నీళ్ల చారుతో వడ్డించారు. మెనూ ప్రకారం ఆలుగడ్డ, పాలకూర పప్పు, సాంబారు, పెరుగు అందించాల్సి ఉండగా, కారంతో కూడిన నీళ్ల చారు, బెండకాయ, సాంబారు, మజ్జిగను అందించారు. మధ్యా హ్న భోజనంలో కోడి గుడ్డు అందించాల్సి ఉండగా, అరగంట ముందే తరగతి గదిలోనే విద్యార్థులకు కోడిగుడ్లను పంపిణీ చేశారు. పాఠశాలలోని మినరల్ వాటర్ ప్లాంట్లు పనిచేయడం లేవు. ప్రస్తుతం బోరు బావి నీళ్లే తాగుతున్నారు.  

పర్యవేక్షణ లోపం.. విద్యార్థులకు శాపం

పాఠశాలలకు సరఫరా చేసే కూరగాయా లు, వంట సామగ్రి, చికెన్, మటన్, గుడ్లు, పాలు కూడా నాణ్యతను పరిశీలించకపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. విద్యాలయాలకు సరుకులు సరఫరా చేసే వారికే మళ్లీ మళ్లీ టెండర్లు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్, వంట ఏజెన్సీలు, ఇతర సంబంధిత అధికారులు కుమ్మక్కై నాసిరకమైన సరుకులను సర్దుబాటు చేస్తున్నట్టు ఆరోపనలు ఉన్నాయి.

కూరగాయలు కూడా నెల లో రెండు, మూడు సార్లు మాత్రమే ఎక్కువ మొత్తంలో ఒకేసారి సరఫరా చేయడంతో అవి రెండు రోజులకే కుళ్లిపోతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కూరగాయలను సక్రమంగా కడగక, వాటితో వండిన కూరలను తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్టు ప్రాథ మికంగా  గుర్తించారు. అటు గురుకులాలకు సరఫరాచేసే మిషన్ భగీరథ నీరు కూడా వానకాలం లీకేజీలతో కలుషితమై వస్తుంది.

వాటినే వంటకు  వాడటంతో ఆహారం కలుషితం అవుతోందని గురుకులాల ప్రిన్సిపా ల్స్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీటన్నీంటిని పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు జిల్లా కార్యాలయాలకే పరిమితం కావడంతో క్రిందిస్థాయి అధికారులు ఆడిందే ఆటగా మారిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆయా గురకులాలకు సరఫరా చేసే బియ్యం కూడా నాసిరకం కావడంతో కొన్ని రోజులకే తుట్టెలు కట్టి పురుగులు పడుతున్నాయని చెప్తున్నారు. వాటిని చెరగకపో వడంతో భోజనంలో పురుగులు కనిసిస్తున్నాయని తెలుస్తుంది.

బెస్ట్ అవైలబుల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్

25 మంది విద్యార్థులకు అస్వస్థత

నాగర్‌కర్నూల్, ఆగస్టు 8 (విజయక్రాంతి): బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా గుర్తింపు పొందిన ఓ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 25 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో దవాఖాన పాలయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటంలోని  ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. ఇటీవల పెంట్లవల్లి గురుకుల పాఠశాలలో రెండుసార్లు, బుధవారం జడ్చర్ల సమీపంలోని మైనార్టీ గురుకులంలోనూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి.

అయినా, యాజమాన్యాలు కళ్లు తెరవట్లేదు. వేలకు వేలు ఫీజులు గుంజుతూ విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించకపోవడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గురువారం చపాతి, దోసకాయ పప్పు వడ్డించగా గంట వ్యవధిలోనే విద్యార్థులంతా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. దీంతో అంబులెన్సుల్లో అచ్చంపేట సర్కారు దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ప్రైవేటు పాఠశాలలోనూ నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .

రోజు నీళ్ల చారే పోస్తున్నారు

కూరగాయలతో భోజనం రోజు చేయడం లేదు. ఎక్కువగా నీళ్ల చారే పోస్తున్నారు. పెరుగు కూడా నీళ్లలాగా ఉంటుంది. అన్నం గడ్డలు గడ్డలుగా ఉండటంతో తినడానికి ఇబ్బందిగా ఉంది. సార్లకు చెబితే మేము ఏం చేసే ది లేదు.. పైనుంచి వచ్చినట్టు పెడుతున్నమన్నారు. తప్పనిసరి పరిస్థితిలో నీళ్ల చారు, పెరుగుతోనే తింటున్నాం.

 8వ తరగతి విద్యార్థి,

మైనార్టీ గురుకుల బాలుర 

పాఠశాల, కామారెడ్డి

అన్నం దొడ్డు ఉంటుంది

పాఠశాలలో ప్రతిరోజు పెట్టే అన్నం దొడ్డు గా, గడ్డలుగా ఉంటుంది. తినడానికి ఇబ్బందిగా ఉన్నా అదే తింటున్నాం. కూరగాయాలు వండటం లేదు. నీళ్ల చారు మాత్రమే పోస్తున్నారు. మూడు రోజులు కోడిగుడ్లు, వారంలో ఒక రోజు చికెన్ పెడుతున్నారు.

 జియామాన్,10వ తరగతి, మైనార్టీ గురుకుల పాఠశాల, కామారెడ్డి