మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు (ఫైల్)
- విద్యార్థులకు అనారోగ్యం
- వరుస ఘటనలతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
- పట్టించుకోని అధికారులు
మంచిర్యాల, నవంబర్ 8 (విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా ఫుడ్ ఫాయిజన్ ఘటనలతో వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల పట్టింపు లేని తనంతో విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందడంలేదు. కొన్నిసార్లు ఫుడ్ ఫాయిజన్‌కు గురై ఆసుపత్రులపాలవుతున్నారు. వసతి గృహాలను పర్యవే క్షించాల్సిన అధికారులు స్థానికంగా ఉండకుండా, విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరీక్షించకపోవ డంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
మెనూ పాటించిన హాస్టళ్లు
వసతిగృహాలపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏ వసతి గృహంలోనూ మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదు. విద్యార్థులకు పెట్టే టిఫిన్, భోజనం కూడా నాణ్యతగా ఉండటం లేదు. ఉడకని అన్నం, పలుచగా ఉన్న భోజనం పెడుతున్నారు.
ఈ విషయాన్ని ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రికి వచ్చిన విద్యార్థినులు జిల్లా స్థాయి అధికారుల ముందే వెల్లడించారు. అధికారుల తనిఖీలు ఏమాత్రం ఉండటంలేదు. ఏదైనా ఘటన జరిగితే ఆ వసతి గృహంలో వైద్య శిబిరాలు నిర్వహించడం, విజిట్‌ల మీద విజిట్‌లు చేసి మమా అనిపిస్తున్నారే తప్ప హాస్టల్ నిర్వహణపై దృష్టి సారించడం లేదు.
వరుస ఘటనలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా ఈ నెల 5న నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే పాఠశాలలో ఫిట్స్ వచ్చి షేక్ అయాన్ హుస్సేన్ మృతి చెందాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 30 మందికి ఫుడ్ పాయిజన్ కాగా ఇందులో చౌదరి శైలజ పరిస్థితి విషమంగా ఉన్నది.
ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి అస్వస్థత
ఈ ఘటనలు మరవకే ముందే మంచిర్యాల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 12 మంది బాలికలకు ఈ నెల ఆరవ తేదీన అస్వస్థకు గురికాగా ప్రభుత్వాసుపత్రిలో వైద్యం తీసుకొని ఈ నెల 7వ తేదీన హాస్టల్‌కు వెళ్లారు. శుక్రవారం రాత్రి శ్రీలత అనే విద్యార్థినికి మళ్లీ విరోచనాలు కావడంతో వెంటనే వైద్యం నిమిత్తం సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కాగా శుక్రవారం రాత్రి ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు.
అస్వస్థతకు గురైన విద్యార్థినులను, మెస్ ఇన్‌చార్జిలను విడివిడిగా విచారణ జరిపినట్లు సమాచారం. పీవో తనిఖీ సమయంలో మీడియాను, విద్యార్థి సంఘాల నాయకులను అనుమతించలేదు. దీంతో ఆశ్రమ పాఠశాల నుంచి బయటకు వస్తున్న క్రమంలో పీవోను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని నిలదీశారు.