ఎంవిఐ కృష్ణవేణి..
శివరాంపల్లిలో వెయ్యి మంది విద్యార్థులతో భారీ ర్యాలీ
రాజేంద్రనగర్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కృష్ణవేణి పేర్కొన్నారు. బుధవారం ఉదయం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి జెడ్పి పాఠశాల విద్యార్థులు సుమారు 1000 మంది ఎంఈఓ శంకర్ రాథోడ్ ఆధ్వర్యంలో పాఠశాల నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాశాఖ, పోలీసు, ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దన్నారు. తల్లిదండ్రులు మైనర్లు అయిన తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు వాహనాలు నడిపి జీవితాలను కోల్పోవద్దని తెలిపారు. 21 సంవత్సరాల తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొంది వాహనాలను నడపాలని సూచించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవిఐ శ్రీముఖి, ట్రాఫిక్, సివిల్ ఎస్సైలు, జోనల్ సెక్రటరీ గంగ్యా నాయక్, సుదర్శన్, పిడిలు హైస్కూల్ టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.