బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16న జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవమ్మ, నారాయణ రాజు. వరంగల్ జిల్లా దేవనూరు స్వగ్రామం. ఇక్కడ కొంత ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిన తర్వాత, కవి పండితులకు కాణాచిగా పేరు పొందిన మడికొండకు వెళ్ళారు. అక్కడ తమ పెద నాయన రాఘవరాజు పోషణలో చదువులో మరికొన్ని మెట్లు ఎక్కారు.
తొలి పరిశోధన
హన్మకొండలో హెచ్చెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. హైదరాబాదులోని నిజాం కళాశాలలో బి.ఏ. చదివి పట్టభద్రులయ్యారు. ఎం.ఏ. లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన తర్వాత వారు తెలుగులో జానపద సాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందాలనుకున్నారు. కానీ, పల్లెపట్టుల్లో పామరులు పాడుకునే లొల్లాయి పదా లు పరిశోధనాంశంగా తగవన్న అభ్యంతరం వచ్చింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీర ంజనం, సురవరం ప్రతాపరెడ్డిల సిఫార్సుతో పరిస్థితులు చక్కబడ్డాయి.
తెలంగాణలోని అనేక మారుమూల గ్రామాలు తిరుగుతూ జానపదుల నోట విన్న వేలపాటలను రాసుకున్నారు. ఇదే సమయంలో కొన్ని వేల తాళపత్ర గ్రంథాలను, కాగితపు ప్రతులను సేకరించారు. ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో 1955లో తమ సిద్ధాంత గ్రంథానికి సమగ్రరూపం ఇచ్చి విశ్వవిద్యాలయానికి అందించారు. 1956లో పిహెచ్.డి.ని సాధించారు. ఈ పట్టాకు రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి-ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగుశాఖ నుంచి ఇదే మొట్టమొదటి పిహెచ్.డి. రెండవది దక్షిణ భారతదేశంలోనూ ఇదే తొలి పిహెచ్.డి. పరిశోధన! రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలలోను, విదేశాలలోను జానపద సాహిత్యంపై పలు సెమినార్లు జరిగాయి. అట్లాంటి ఎన్నో చర్చాగోష్ఠులకు రామరాజు అధ్యక్షులుగా, ముఖ్య అతిథిగా హాజరై అనేక అమూల్య అంశాలను వెల్లడించారు.
ప్రాచీన కవుల కృషి వెలుగులోకి!
రామరాజు పరిశోధన కేవలం జానపద సాహిత్యానికే పరిమితం కాలేదు. వారి నిరంతర కృషికి మరెన్నో కోణాలున్నాయి. ప్రతిభావంతులై వుండి ప్రచారానికి నోచుకోని ప్రాచీన కవుల కావ్యాలపై వారి దృష్టి పడింది. జానపద సాహిత్య పరిశోధనకన్నా మూడేండ్ల ముందునుంచే ‘మరుగున పడిన మాణిక్యాలు’ శీర్షికన పరిశోధన ప్రారంభి ంచారు. 1950 నుండి ఈ వ్యాసాలు గోలకొండ పత్రికలో ప్రచురితమవుతూ వచ్చాయి. ‘మరుగున పడిన మాణిక్యాలు’ సంపుటిలోని వ్యాసాలను, తర్వాత వచ్చిన మరికొన్ని వ్యాసాలను కలిపి ‘బి. రామరాజు షష్ట్యబ్ది పూర్తి సంఘం’ వారు 1985లో ‘చరిత్రకెక్కని చరితార్థులు’ పేరుతో ప్రచురించారు. ఇందులో తెలుగు విభాగంలో 22 మంది కవులు, వారి కావ్యాలను, సంస్కృత విభాగంలోని 12 మంది కవులు, వారి కావ్యాలను గురించి రామరాజు పరశోధనాత్మక రచనలు చేశారు. పూర్వ పరిశోధకుల పొరపాట్లను సవరించడం కూడా పరిశోధకుల బాధ్యత. వేటూరి ప్రభాకరశాస్త్రి తమ ‘చాటు పద్యమణి మంజరి’లో చతురంగ విద్యలో శ్రీకృష్ణదేవరాయలను మెప్పించిన బొడ్డుచర్ల తిమ్మనను, ‘ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధ’ రచయిత అయిన బొడ్డుచర్ల తిమ్మయను ఒకరుగానే పొరపడ్డారు. కానీ, ఈ ప్రబంధాన్ని 1962లో పరిష్కరించిన రామరాజు వాళ్ళిద్దరు వేర్వేరు వ్యక్తులని ఆధారాలు చూపుతూ నిరూపించారు. వీరి ‘ప్రరోచన’ అన్న పీఠిక విలువైంది. వీరు పరిష్కరించి వెలుగులోకి తెచ్చిన కావ్యాలలో సాయప వెంకటాద్రి నాయకుని ‘సకల సంజీవనము’ ఒకటి. ఇది విశిష్ట అద్వైత మత ప్రవక్త రామానుజాచార్యుల వారి జీవితానికి పద్యరూప గ్రంథం. జీవితంలో సమకాలీన స్థితిగతులపై రామానుజుల వారు చేసిన తిరుగుబాటు, శైవుల నుండి వచ్చిన ప్రతిఘటన, సామాన్య జనులపట్ల కులాతీతంగా వ్యవహరించిన తీరు -మొదలైనవి ఇందులో చిత్రితమైనాయి. విశిష్టాద్వైత తాత్వికతను కూడా కవి నిరూపించారు. ఈ గ్రంథాలనేకాక - తెలుగులో ఛాయాపతి రచించిన ‘రాణవాభ్యుదయము’, పాల్కురికి సోమన రచించిన ‘పండితారాధ్య ఉదాహరణ’, రఘునాథ నాయకుడు రచించి న ‘వాల్మీకి చరిత్ర’, పాలవేకరి కదిరీపతి రచించిన ‘శుకసప్తతి’, మడికి సింగన రచించిన ‘పద్మ పురాణం’ మొదలైన కావ్యాలను వెలుగులోకి తెచ్చారు. ఇకపోతే, రామరాజు పరిష్కరించిన సంస్కృత కావ్యా లలో -కాళహస్తి కవి రచించిన సంస్కృత వసుచరిత్ర, శ్రీ కృష్ణదేవరాయల జాంబవతీ పరిణయమ్, కాకతీయ ప్రతాప రుద్రుడు రచించిన ఉపారా గోదయమ్ ముఖ్యమైనవి. రామరాజు సంస్కృత భాషా సాహిత్యాలలో విశేష కృషి చేసిన పండితులు. ముదిగొండ వీరేశలింగ శాస్త్రి, నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల శిష్యరికంలో వారు సంస్కృతం నేర్చుకొని, ఎం. ఏ. సంస్కృత పట్టా సాధించారు. తెలుగు కవి పండితుల సంస్కృత రచనలద్వారా సంస్కృత సాహిత్యానికెంత మేలు జరిగిందనేది నిర్వివాదమైన అంశం. ఈ అంశానికి Contribution of Andhra to Samskrit Literature శీర్షికన ఆంగ్లంలో పీ. హెచ్.డీ పట్టాకై పరిశోధన ప్రారంభించారు. అయితే, ఇది సకాలంలో వారు విశ్వవిద్యాలయానికి సమ ర్పించ లేకపోవడంతో పట్టా రాలే దు. అయినా తమ దశాబ్దాల కృషికి 800 పేజీల ఆంగ్లగ్రంథంగా 2002లో దీనిని ప్రచురించారు. అగస్త్యుడు కాకతీయ ప్రతాపరుద్రుని (క్రీ.శ. 1295- 1325) ఆస్థానకవి. ఈయన 74 గ్రంథాలు రచించారు. కానీ, మనకు ఇప్పుడు దొరుకు తున్నవి ఐదారే. వీటిని పరిశీలించి ఈ కవిమీద మహాకవి కాళిదాసు ప్రభావం వుందని రామరాజు నిరూపించారు. వీరి రచనలలో ‘కృష్ణ చరిత్ర’ గద్యకావ్యం, ‘నలకీర్తి కౌముది’ అనే నాలుగంకాల నాట కం ముఖ్యమైనవి. హైదరాబాద్ రాష్ట్రంలో ఒకప్పుడు భాగంగా వున్న, ధైర్యశౌర్యాలకు ప్రతీక అయిన ‘సురాపురం’ ఆస్థాన కవి అన్నమార్యుడు 18వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన ‘తత్వగుణాధర్మ’, ‘ఆతార్యవింశతి’, ‘దేశికయ శోభూషణం’ వంటి ఏడు గ్రంథాలను రచించారని రామరాజు తెలిపేవారు. ఈ కవి వంశవృక్షాన్ని కూడా పొందుపరిచారు. ఇట్లా, 224 మంది కవి పండితు లను గురించి అనేక విశేషాలను తెలియ జేసిన, రామరాజు వివిధ తెలుగు కవులు తమ తెలుగు కావ్యాలలో సందర్భోచితంగా రాసిన సంస్కృత శ్లోకాలను కూడా రెండవ అనుబంధంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయికి
తెలుగువారు సంస్కృత భాషా సాహిత్యాలకు చేసిన సేవలను ఆంగ్లంలో రాసినట్లే, Folk Songs of Andhra Pradesh, Folk Tales of Andhra Pradesh, Moharram Folk Songs పుస్తకాలను కూడా రామరాజు ప్రచురించారు. అంతేకాదు, వారు ఉజ్జయిని కలకత్తా, కటక్, రాంచీ వంటి నగరాలలో జానపద విజ్ఞానం మీద ఆంగ్లంలో పత్ర సమర్పణ చేశారు. అవన్నీ Glimpses into Telugu Folklore అన్న పుస్తకంగా 1991లో ప్రచురణైంది. కుతుబ్ షాహీ రాజులన్నా, ఆ కాలం నాటి సంస్కృతి అన్నా రామరాజుకి ఎంతో అభిమానం. అందుకే, విషయజ్ఞులైన పండితులతో ప్రత్యేకంగా వ్యాసాలు రాయించి పుస్తకంగా ప్రచురించారు. కాకతీయ విశ్వవిద్యాలయం పి.జి సెంటర్‌ను, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖను తీర్చిదిద్దిన పరిపాలనాదక్షులు, అనేక గ్రంథాలు, సాహితీ సంస్థలను వికాసపథంలో నడిపించిన కార్యదక్షులు. ఆచార్య బిరుదురాజు రామరాజు స్వల్ప అనారోగ్యం కారణంగా 2010 ఫిబ్రవరి 8న తుదిశ్వాస విడిచారు.
(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుండి..)