- గ్రేటర్‌లో దోమల స్వైరవిహారం
- అరకొర సిబ్బందితో నియంత్రణ చర్యలు కరువు
- ప్రజాప్రతినిధుల ఆబ్లిగేషన్ల విజిట్లకే పరిమితం
- ప్రభుత్వ విభాగాల మధ్య కొరవడుతున్న సమన్వయం
- జాడలేని డ్రోన్ స్ప్రే, కూల్ ఫాగింగ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): భాగ్యనగరంలో దోమలు స్వైరవిహారం రోజురోజుకు అధికమవుతోంది. 1.40 కోట్ల జనాభాకు ఆరోగ్యకర వాతావరణం కల్పించాల్సిన బల్దియా పాలకవర్గం తమకు వచ్చే పన్నులపై పెట్టేంత దృష్టి.. మౌలిక సౌకర్యాలపై కల్పనపై పెట్టడం లేదు.
అరకొర సిబ్బంది, తోటి విభాగాలతో సమన్వయ లోపంతో పౌరులకు దోమల నుంచి ఉపశమనం కల్పించలేని స్థితికి బల్దియా చేరుకుంటుంది. దోమల నివారణకు సాంకేతిక పద్ధతులను అమలు చేస్తామని చెప్పిన మాటలన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
దీంతో నగరంలో అపరిశుభ్రమైన వాతావరణం, దోమల బెడదతో ప్రజలు విసిగెత్తిపో తున్నా రు. ప్రస్తుతం బల్దియా సిబ్బంది సర్వేలో బిజీ గా ఉండటంతో దోమల నివారణ గురించి పట్టించుకునే నాథుడు కారువయ్యాడు.
అరకొరగానే సిబ్బంది..
గ్రేటర్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంటమాలజీ విభాగం పాత్ర చాలా కీలకమైంది. దోమల పునరుత్పత్తి జరగకుం డా క్షేత్రస్థాయిలో నిరంతరం చర్య లు చేపట్టాల్సిన యాంటీ లార్వా ఆపరేషన్ (ఏఎల్ వో) గ్రేటర్‌లో 2,460 మంది సిబ్బంది మాత్ర మే ఉన్నట్లు అధికారిక సమాచారం. ఒక్కో గ్రూప్ లో 18 మంది సిబ్బందితో ఒక్కో సర్కిల్‌కు 4 నుంచి 5 గ్రూపులు పనిచేస్తుంటాయి.
అయితే, అధికారులు చెబుతున్నట్టుగా కాకుండా ప్రస్తుతం గ్రేటర్‌లో 125 గ్రూపులు (2,270 మంది) మాత్రమే పనిచేస్తున్నట్టు సమాచారం. ఒక్కో సర్కిల్‌కు ఫాగింగ్ సిబ్బంది ఒక్కో గ్రూపు ఉండాల్సినప్పటికీ, ప్రస్తుతం రెండు సర్కిళ్లకు ఒక గ్రూపు మాత్రమే ఉన్నారు. ఫాగింగ్ సిబ్బంది మొత్తం 350 మంది మాత్రమే ఉన్నారు. దోమల నివారణకు ఉపయోగించే పొర్టబుల్ ఫాగింగ్ మిషన్లు 291 ఉండగా, వెహికల్ మిషన్లు 63 ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.
ఆబ్లిగేషన్లకే పరిమితం..
ఎంటమాలజీ విభాగంలో అసలే అరకొరగా సిబ్బంది ఉండగా, ఉన్న సిబ్బందిని స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తమకు వచ్చే ఫిర్యాదులను అటెండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులను అటెండ్ చేయాలని చెప్పడంలో తప్పులేదు. కానీ, సిబ్బంది కొరతగా ఉండటం చేత ఫాగింగ్ సిబ్బంది ఆబ్లిగేషన్లకే ఎంగేజ్ అవుతున్నట్టు తెలుస్తోంది.
దీంతో జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ఎంటమాలజీ విభాగం గుర్తించిన దోమల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో విధులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. గ్రేటర్‌వ్యాప్తంగా 4,846 కాలనీలున్నాయి. వీటిలో దోమలు అత్యధికంగా ఉంటాయని భావించే 3,874 సెల్లార్లు, 12 వేలకు పైగా తాళం వేసిన ఇండ్లు, 6 వేల ఓపెన్ ప్లాట్లు, 748 ఫంక్షన్ హాళ్లు, 628 లో లేయింగ్ ప్రాంతాలు, 185 చెరువులు, భవన నిర్మాణాలు జరుగుతున్న 6 వేల సైట్స్‌లలో ఎంటమాలజీ విభాగంలో ఉన్న సిబ్బంది పనిచేయడం చాలా కష్టంగా మారింది.
దోమల బెడద, ఫాగింగ్ తదితర ఫిర్యాదులకు మై జీహెచ్‌ఎంసీ యాప్, జీహెచ్‌ఎంసీ ఎక్స్(ట్విటర్)తో పాటు టోల్ ఫ్రీ నంబర్ 2111 1111 కు ఫిర్యాదులు అత్యధికంగా వస్తున్నట్టుగా తెలుస్తోంది.
శాస్త్రీయ పద్ధతులకు దూరంగా..
బల్దియాలో దోమలవ్యాప్తి నివారణకు సాంప్రదాయ పద్ధతులనే అనుస రిస్తోంది. ఇప్పటికే మాలథియాన్ కెమికల్‌తో ఫాగింగ్ చేసే సమయంలో వినియోగించే డీజిల్ వ్యవహారంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెట్టినా.. దోమలవ్యాప్తిని అరికట్టడానికి ఇటీవల బల్దియా డ్రోన్లతో చెరువులు, కుంటలు ప్రదేశాల్లో స్ప్రే చేసేందుకు పలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది.
చైనాలో వినియోగించే కూల్ ఫాగింగ్‌ను సైతం అందుబాటులోకి తెస్తామ ని ప్రకటించారు. కానీ, ఇవేమీ బల్దియాలో ఆచరణకు నోచుకోవడం లేదు. ఇదిలా ఉండగా, దోమల నివారణకు ఫాగింగ్ కోసం వినియోగించే కెమికల్‌కు దోమలు చనిపోవడం లేదనీ, ఈ కెమికల్‌ను కూడా తట్టుకోగలిగే కెపాసిటీని దోమలు చేరుకున్నట్టుగా నిపుణులతో సహా బల్దియా అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.
అలాంటప్పుడు ఫాగింగ్ కు బదులుగా ప్రత్యామ్నాయ కార్యచరణపై దృష్టి పెట్టాల్సింది వదిలేసి పాత పద్ధతులకే అధికారులు మొగ్గు చూపుతుండటం గమనార్హం. ఇప్పటికైనా దోమల నియంత్రణపై బల్దియా చిత్తశుద్ధితో వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.