12-03-2025 11:05:45 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్ లో అందిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, అన్ని మండలాల తహసిల్దార్లతో ధరణి (భూ భారతి)లో వచ్చిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్(Dharani Portal)లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ఫైల్ వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, రాజస్వ మండల అధికారి లాగిన్ లలో ఉన్న ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ధ్రువీకరణ పత్రాల కొరకు వచ్చే దరఖాస్తులను నిబంధనలకు లోబడి త్వరగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్. ఆర్. ఎస్. దరఖాస్తుల పై ప్రతిరోజు సమక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.