రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం
కరీంనగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం సైదాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. పాడి పశువుల పోషణ, చేపల పెంపకం, పండ్ల తోటలు, ఆయిల్‌పాం, డ్రాగన్ ఫ్రూట్, పట్టు పరిశ్రమలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. సంప్రదాయ పంటల్లో పెరుగుతున్న ఖర్చు వల్ల ఆదాయం తక్కువ ఉంటుందన్నారు. ఖర్చు తక్కువగా ఉండి ఆదాయం అధికంగా వచ్చే పంటలపై అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
వరినాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చట
మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సైదాపూర్ వెళ్తుండగా మార్గమధ్యంలో వరి నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ఎంతమందికి లక్షా 50 వేల రుణమాఫీ అయ్యిందా అని అడిగి తెలుసుకున్నారు. తామందరికీ రుణమాఫీ పూర్తయిందని మహిళలు సమాధానమిచ్చారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తమకు ఎంతో మేలు చేస్తుందన్నారు.