calender_icon.png 29 November, 2024 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టౌన్ ప్లానింగ్ ప్రక్షాళనపై ఫోకస్!

29-11-2024 12:54:11 AM

  1. మూడు లక్ష్యాలను నిర్ధేశించిన కమిషనర్ 
  2. డెబ్రీస్ తొలగింపు, కోర్టు కేసుల సత్వర పరిష్కారం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టార్గెట్ 
  3. నిరంతర నిఘా కోసం సిబ్బందికి వాకీటాకీలు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): బల్దియాలో పట్టణ ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళించేందుకు కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ వ్యాప్తం గా టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధిక ఫిర్యాదులు అందడమే కాకుండా, ఈ విభాగం అధికారులు, సిబ్బందిపై కూడా ఎక్కువ సంఖ్యలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రేటర్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తి ముందుగా ప్రణాళిక విభాగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు భవన నిర్మాణాల అనుమతులకు మాత్రమే పరిమితమైన టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందిని నిరంతరం పనిలో పెట్టేందుకు కమిషనర్ ప్రణాళికలు రచిస్తున్నారు.

మూడు లక్ష్యాలపై టార్గెట్.. 

బల్దియాలో అత్యధిక ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగంపై వస్తున్నందున ఈ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందిపై కమిషనర్ నిరంతరం నిఘా పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల మేయర్ బల్దియా కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించగా సీసీపీ అందుబాటులో లేరు. ఝార్ఖండ్ ఎన్నికల విధుల్లో ఉన్న కమిషనర్ ఇలంబర్తే పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఉన్నా.. తక్షణమే రెస్పాండ్ అయ్యేలా వాళ్లకు వాకీటాకీలు అందజేశారు. 

దీంతో ఈ విభాగంపై నిరంతరం బాధ్యతతో కూడిన విధులు నిర్వహిం చాలని పరోక్షంగానే హెచ్చరించినట్లుంది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో మంచి ఫలితాలు రాబట్టేందుకు ముందుగా ఆయా ప్రాంతాల్లో పారబోసే భవన నిర్మాణ వ్యర్థాలను (సీ అండ్ డీ) తొలగించే బాధ్యతను టౌన్ ప్లానింగ్ విభాగానికే అప్పగిం చారు.

ఇష్టారీతి గా సీ అండ్ డీ వ్యర్థాలను పారబోసే వారిపై జరిమా నాలు విధించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక ప్లాంట్లకు ఈ వ్యర్థాలను తరలించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ విభాగానికి చెందిన కోర్టు కేసులు సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, కమిషనర్ విధించిన టార్గెట్‌ను టౌన్ ప్లానింగ్ విభాగం చేరుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

టౌన్ ప్లానింగ్‌లోనే అత్యధిక ఫిర్యాదులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవే ఉంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం జరిగే ప్రజవాణిలో సగానికిపైగా ఫిర్యాదులు ఈ విభాగానికి చెందినవే ఉండటం విశేషం.

ఈ నెలలో ఇప్పటివరకు గ్రేటర్‌వ్యాప్తంగా మొత్తం 426 ఫిర్యాదులు అందగా, వీటిలో దాదాపు సగం ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ నాలుగు వారాల్లో మొత్తం 170 ఫిర్యాదులు అందగా, అందులో అత్యధికంగా 92 ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవే.

దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదుల్లో వచ్చే అవినీతి ఆరోపణల నుంచి ప్రజలకు పారదదర్శకమైన సేవలు అందించేలా చర్యలు తీసుకునేందుకు కమిషనర్ కసరత్తు చేస్తున్నారు.