calender_icon.png 21 September, 2024 | 5:38 AM

థీమ్ ఆధారిత సర్క్యూట్లపై ఫోకస్

21-09-2024 01:52:59 AM

పరస్పర సహకారంతో ముందుకెళ్దాం

స్పెయిన్ రాయబారితో మంత్రి జూపల్లి

హైదరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకారమందించాలని స్పెయిన్ రాయబారి హువన్ ఆంథోనియో మార్సో పుజోల్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఇరు ప్రాంతాలు పర్యాట కులను ఆకర్షించేలా పరస్పర సహకారంతో ముందుకెళ్దామని పిలునిచ్చారు. తమ ప్రభుత్వం వివిధ దేశాలతో కలిపి థీమ్ ఆధారిత సర్క్యూట్లపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును ఆంథోనియో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల పర్యాటక రంగాలపై చర్చించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రపంచస్థాయి వసతుల కల్పనే లక్ష్యంగా ముందు కెళ్తున్నట్లు మంత్రి జూపల్లి పుజోల్‌కు వివరించారు. రాష్ర్టంలో కొత్తగా నిర్మించబోయే ఫోర్త్ సిటీతో విదేశీ పర్యాటకులను మరింత ఆకర్శించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం, ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి భారతదేశంలో పర్యాటకాభివృద్ధికి సానుకూలమైన అంశాలని స్పెయిన్ రాయబారి పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.