calender_icon.png 8 October, 2024 | 10:13 PM

ఆర్బీఐ పాలసీ, గ్లోబల్ ట్రెండ్స్‌పై దృష్టి

07-10-2024 01:05:31 AM

ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 6:  మధ్యప్రాచ్యంలో తలెత్తిన యుద్ధ ఉద్రిక్తతలతో గతవారం భారత్ స్టాక్ మార్కెట్ హఠాత్తుగా తీవ్ర పతనాన్ని చవిచూసింది.  ఈ వారం సైతం ఇన్వెస్టర్లు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై దృష్టి నిలుపుతారని, అందుకు అనుగుణంగానే మన మార్కెట్ కదలికలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమీక్షలో వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం కూడా ఈ వారం ట్రేడింగ్ ట్రెండ్‌ను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెపుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ, ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించే ఆర్థిక ఫలితాలు, ఐటీ వ్యాపారంపై ఆ కంపెనీ కామెంటరీపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారన్నారు.

యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా అరశాతం తగ్గించడం, చైనా కేంద్ర బ్యాంక్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చే ఆర్థిక ప్యాకేజీకి ప్రకటించిడంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన రికార్డు ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది.

ఈ వారం మొత్తంమీద (నాలుగు ట్రేడింగ్ సెషన్లు) సెన్సెక్స్ 3,883 పాయింట్లు (4.6 శాతం) , నిఫ్టీ 1,164 పాయింట్లు (4.5 శాతం) చొప్పున తగ్గాయి. ఒకే వారంలో ఇంతగా క్షీణించడం గత రెండేండ్లలో ఇదే ప్రధమం. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ ఇన్వెస్టర్లు రూ.16.29 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.  

ఎంపీసీ నిర్ణయంపై ఫోకస్

గ్లోబల్ సంకేతాలకు తోడు దేశీయంగా మార్కెట్ అక్టోబర్ 9 బుధవారం వెల్లడయ్యే ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయంపై దృష్టిపెడుతుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. ఎంపీసీ సమావేశం అక్టోబర్ 7న మొదలై మూడు రోజులు కొనసాగుతుంది. వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడిస్తారు.

ద్వితీయ త్రైమాసికపు ఫలితాల సీజన్‌ను అక్టోబర్ 10న టీసీఎస్ ప్రారంభిస్తుందని, ఈ ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్నారని గౌర్ తెలిపారు. అంతర్జాతీయ కమోడిటీ ధరలు, ఈ వారం వెలువడే యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్ దిశను నిర్దేశించడంలో కీలకంగా ఉంటాయని వివరించారు. 

ఎఫ్‌పీఐ అమ్మకాలు 3 రోజుల్లో రూ.27,000 కోట్లు

సెప్టెంబర్ నెలలో భారత్ స్టాక్ మార్కెట్లోకి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చిన  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అక్టోబర్ నెల తొలి మూడు రోజుల్లోనే రూ. 27,000 కోట్లకుపైగా తరలించుకుపోయారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి 4వ తేదీవరకూ మూడు ట్రేడింగ్ రోజుల్లో (అక్టోబర్ 2న మార్కెట్‌కు సెలవు) ఎఫ్‌పీఐలు దేశీయ ఈక్విటీల్లో రూ.27,142  కోట్ల నికర విక్రయాలు జరిపారు. 

ఇజ్రాయిల్, ఇరాన్‌ల పరస్పర దాడులు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడం, చైనా ఉద్దీపన ప్యాకేజీతో అక్కడి మార్కెట్ ఆకర్షణీయంగా మారడం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను అమ్మకాలకు పురికొల్పాయని విశ్లేషకులు తెలిపారు. వీరు సెప్టెంబర్ నెలలో భారత్ మార్కెట్లో రూ. 57,724 కోట్లు పెట్టుబడి చేశారు. 

నెగిటివ్ సెంటిమెంట్

గత వారం ప్రారంభంలో నిఫ్టీ 26,000 పాయింట్లను, సెన్సెక్స్ 85,000 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డులు నెలకొల్పినప్పటికీ, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, విదేశీ ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో పెట్టుబడుల్ని భారత్ నుంచి చైనా స్టాక్స్‌లోకి తరలించడంతో దేశీయంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

దీనితో ప్రధాన స్టాక్ సూచీలు 4 శాతంపైగా పతనమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో భౌగోళిక పశ్చిమాసియాలో పరిణామాలు, క్రూడ్ ధరలపై వాటి ప్రభావాన్ని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. విదేశీ పెట్టుబడుల రాకపోకలు, దేశీయ సంస్థల కొనుగోళ్లు కూడా ఈ వారం మార్కెట్ ట్రెండ్‌కు కీలకమని మిశ్రా వివరించారు.