calender_icon.png 12 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్బీఐ పాలసీపై ఫోకస్

02-12-2024 12:00:00 AM

జీడీపీ, ఆటో సేల్స్ డేటాపై నేడు ఇన్వెస్టర్ల స్పందన

మార్కెట్ ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు

ముంబై,  డిసెంబర్ 1: గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ గణాంకాలు, ఆదివారం వెల్లడైన ఆటో సేల్స్ డేటాపై ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ స్పందించిన అనంతరం గ్లోబల్ సంకేతాలు, విదేశీ ఫండ్స్ ట్రేడింగ్ యాక్టివిటీకి అనుగుణంగా మార్కెట్ కదలికలు ఉంటాయని విశ్లేషకులు తెలిపారు.  ఈ వారం ద్వితీయార్థంలో జరిగే రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మార్కెట్‌కు కీలకమని అనలిస్టులు చెపుతున్నారు. 

ఆరు వారాలు పాటు భారీ పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్ వరుసగా నవంబర్ చివరి రెండువారాలపాటు కొంతమేర కోలుకున్నది.  గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 685, నిఫ్టీ 223 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. క్యూ2లో నిరుత్సాహకర జీడీపీ వృద్ధిపై సోమవారం మార్కెట్లు రియాక్ట్ అవుతాయని, అటుతర్వాత ఆర్బీఐ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానాలు స్టాక్స్ కదకలికల్ని ప్రభావితం చేస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు.

అంతర్జాతీయ అంశాలకొస్తే రష్యా ఉద్రిక్తతలు ఆందోళనకారకమని చెప్పారు. జీడీపీ డేటా, ఆటో సేల్స్ డేటాలపై స్పందించిన అనంతరం ప్రధాన ఫోకస్ ఆర్బీఐ మానిటరీ పాలసీపైనే ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. ఈ జూలై ద్వితీయ త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండేండ్ల కనిష్ఠస్థాయి 5.4 శాతంగా నమోదయ్యింది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు, వినియోగం తగ్గడం వృద్ధిని దెబ్బతీసాయి. 

దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు

 దేశీయంగానూ, అంతర్జాతీయంగా వివిధ ఆర్థిక గణాంకాలు ఈ వారం వెలువడతాయని, ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ, యూఎస్ ఎస్ అండ్ పీ గ్లోబల్ కాంపోజిట్ పీఎంఐ, మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ, నాన్ పేరోల్స్, జాబ్‌లెస్ క్లెయిమ్స్ తదితర గణాంకాలన్నీ ట్రేడింగ్‌పై ప్రభావం చూపిస్తాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ అరోరా చొప్రా తెలిపారు.

ఈ వారం వెలువడే ఇండియా, యూఎస్, చైనాల మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా, యూఎస్ జాబ్స్ డేటా, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ప్రసంగం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని  స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్  సంతోష్ మీనా వివరించారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 21,612 కోట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) ఈ నవంబర్ నెలలో కూడా భారీగా నిధుల్ని వెనక్కు తీసుకున్నారు.  నవంబర్ నెల మొత్తంమీద రూ.21,612 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్‌పీఐలు నికరంగా విక్రయించారు. అయితే అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో ఎఫ్‌పీఐల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో విదేశీ ఫండ్స్ భారీగా రూ.94,017 కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నాయి. ఈ 2024 ఏడాదిలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ.15,019 కోట్ల పెట్టుబడుల్ని తరలించారు.  రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.