calender_icon.png 6 November, 2024 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్సిల్వేనియాపై దృష్టి

06-11-2024 12:20:22 AM

న్యూఢిల్లీ, నవంబర్ 5: అమెరికా ఎన్నికల చివరిరోజు రిపబ్లికన్, డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న పెన్సిల్వేనియాపై ఇరువురు దృష్టి సారించారు. దీంతో బుధవారం ఒకేరోజు ఇద్దరూ పెన్సెల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్ నగరంలో చివరి నిమిషం వరకు ప్రచారం నిర్వహించారు.

స్థానిక పీపీజీ పెయింట్స్ అరీనాలో ట్రంప్ సభ నిర్వహించగా.. క్యారీ ఫర్నేస్ వద్ద కమలా ర్యాలీ నిర్వహించారు. ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘బైడెన్ కార్యవర్గం లోపాలపై విరుచుకుపడ్డారు. ఇప్పటికంటే నాలుగేళ్ల క్రితమే ప్రజలు బాగుండేవారన్నారు. తాను అధికారంలోకి వస్తే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంతో పాటు సరిహద్దు భద్రతను పెంచుతామని చెప్పారు.

డ్రగ్స్ మహమ్మారిని అరికడతానని, వలసదారుపై కఠిన నిర్ణయాలు తీసుకుంటా’ అని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మేము శ్రమించడాన్ని ఇష్టపడతాం. గతకొన్నేళ్లుగా అమెరికన్లు పరస్పరం నిందించుకుంటున్నారు. దీనికి ఖచ్చితంగా ముగింపు పలకాల్సిందే. అందరం కలిసి మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం’ అని కమల పిలుపునిచ్చారు.

ఆ రాష్ట్రమే కీలకం..

అమెరికాలోని స్వింగ్ స్టేట్స్‌లో పెన్సిల్వేనియా ప్రధానమైంది. ఇక్కడ రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పోరు తీవ్రంగా ఉంది. 270 మెజార్టీ మార్కును అందించడంలో 19 ఎలక్ట్రోరల్ ఓట్లున్న ఈ రాష్ట్రం.. ఇరుపార్టీల నేతలకు చాలా కీలకంగా మారింది. అందుకే పెన్సిల్వేనియాలో అభ్యర్థులిద్దరూ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.