calender_icon.png 1 March, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీం వర్క్‌తో ‘పది’పైశ్రద్ధ !

01-03-2025 12:00:00 AM

  1. పదిలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి
  2. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
  3. అల్పాహారానికి నిధుల మంజూరు
  4. 'విజయక్రాంతి' తో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్

మెదక్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): పది పరీక్షల్లో గతానికి భిన్నంగా మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా టీం వర్క్ చేస్తున్నాం..విద్యార్థులు నేర్చుకున్నది భయం లేకుండా పరీక్షల్లో రాసేలా తీర్చిదిద్దుతున్నామని మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ అన్నారు. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ చేస్తున్న కసరత్తు..తీసుకుంటున్న చర్యలను డీఈవో 'విజయక్రాంతి'కి వివరించారు. 

ప్రత్యేక తరగతులతో బోధన...

గడిచిన రెండేళ్ళుగా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. నవంబర్ మొదటి వారం నుంచే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 10,387 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండగా ఇందులో 7,500 మంది వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. 2,800 మంది ప్రైవేట్  పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. 

మార్చి 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు...

ఈ ఏడాది సైతం గతేడాది మాదిరిగానే విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులు మార్చి 20 వరకు కేటాయించింది. ఒంటిపూట బడుల సమయంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్రతీ పాఠశాలలో ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం.

విద్యార్థులు సులువుగా నేర్చుకునేందుకు ఈ ఏడాది ప్రభుత్వం అభ్యసన దీపికలు అందజేసింది. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు టైం టేబుల్ సిద్ధం చేస్తున్నాం. గత సంవత్సరం పరీక్షా పత్రాలను అభ్యసన చేయిస్తున్నాం. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా గ్రూపులుగా విభజించి బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం. 

ఉదయం 5 గంటలకు వేకప్ కాల్స్...

విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ఉదయం 5 గంటలలోపు ఫోన్ కాల్స్ చేసి నిద్రలేపుతున్నాం. వారి తల్లిదండ్రులతో మాట్లాడేలా ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాం. పిల్లల విషయంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాం. హెచ్‌ఎంలు, ఎంఈవోలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సమిష్టి కృషితో సత్పలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం.