24-03-2025 11:41:25 PM
ఆకస్మిక తనిఖీ..
వెంకటాపురం పోలీస్ స్టేషన్ రికార్డుల పరిశీలిన..
అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు..
ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ..
నగూరు వెంకటాపురం (విజయక్రాంతి): నేర నియంత్రణ, పరిశోధనలో భాగంగా సోమవారం ఏటునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐ.పి.ఎస్ వెంకటాపురం పోలీస్ స్టేషన్ ని సందర్శించి ఆకస్మికంగా స్టేషన్ రికార్డ్స్, 5 (S) ఆర్టికల్ పరంగా మెన్ యొక్క పనితీరుని చెక్ చేసారు. దీనితో పాటు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా నేత్రాలైన సిసిటివి పనితీరుని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాలని, వారు తమ సిబ్బంది గ్రామాలను సందర్శించినప్పుడు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని, గ్రామాలలో వారి రాకపోకలపై కన్నేసి ఉంచాలని, మావోయిస్టులు అమాయక ఆదివాసి ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కేసులలో అరెస్ట్ అయిన మావోయిస్టు పార్టీ సభ్యులను, సానుభూతిపరులను అనునిత్యం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. అదేవిధంగా వెంకటాపురం గోదావరి నది పరివాహక ప్రాంతమైనందున ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించాలని, అక్రమంగా ఇసుక తరలించే వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని, వారి వాహనాలను సీజ్ చేయాలని, వారికి సహకరిస్తున్న వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని, ఇసుక క్వారీ లపైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్.ఐ కె. తిరుపతి రావు, సివిల్, సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.