- ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనాలు
న్యూఢిల్లీ, జూలై 7: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ప్రధమార్థంలో అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలకు అనుగుణంగా కదులుతుందని, ద్వితీ యార్థంలో ఐటీ దిగ్గజ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్ల డించే క్యూ ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతవారం జరిపిన రికార్డు ర్యాలీ అనంతరం ఈ వారం కన్సాలిడేట్ కావచ్చని భావిస్తున్నారు.
జూలై 11, 12 తేదీల్లో టీసీఎస్, హెచ్‌సిఎల్ తదితర కంపెనీలు వెల్లడించనున్న ఆర్థిక ఫలితాలు, మరో వైపు జూలై నెలలో రానున్న కీలకమైన కేంద్ర బడ్జెట్ ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఆసక్తికరమైనవని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. జూలై 9నాటి యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ టెస్టిమోనీ అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు. ఈ అంశాలకు తోడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థల పెట్టుబడుల శైలి, క్రూడ్ ధరలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయన్నారు.
గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 80,392 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,001 పాయింట్ల వద్ద నూతన రికార్డుస్థాయిల్ని నమోదు చేశాయి. వారం మొత్తంమీద సెన్సెక్స్ 963 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
దేశీయ, అంతర్జాతీయ గణాంకాలు
ఈ వారం దేశీయంగా వెల్లడికానున్న రిటై ల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు లోను చేస్తాయని, అలాగే యూఎస్ ద్రవ్యోల్బణం, జాబ్‌లెస్ క్లయింలు, యూకే జీడీపీ డేటా తదితర అంతర్జాతీయ గణాంకాలు మార్కెట్ రాడార్‌లో ఉంటాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసె స్ వైస్ ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా చెప్పారు. టీసీఎస్ మెరుగైన ఫలితాల్ని వెల్లడిస్తుందన్న అంచనాలు ఉన్నా యని, ఐటీ రంగం తీరుతెన్నులపై యాజమాన్యం కామెంటరీపై ఇన్వెస్టర్లు దృష్టి పెడతారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఈ వారం స్టాక్ స్పెసిఫిక్‌గా, సెక్టార్‌స్పెసిఫిక్‌గా మార్కెట్ కార్యకలాపాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు.