న్యూఢిల్లీ, ఆగస్టు 4: కొద్ది వారాలుగా వరుస రికార్డులతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ గతవారం చివరిరోజున హఠాత్తు గా పతనమయ్యింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నదన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు జరుగుతున్నందున ఈ వారం తొలుత గ్లోబల్ ట్రెండ్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటుతర్వాత ఈ వారం వెల్లడికానున్న ఆర్థిక గణాంకాలు, రిజర్వ్‌బ్యాంక్ పాలసీ నిర్ణయం దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
హెచ్‌ఎస్‌బీసీ సర్వీసు రంగ పీఎంఐ సోమవారం వెల్లడికానుండగా, ఆర్బీఐ నిర్ణయం గురువారం వెలువడుతుంది. అలాగే కార్పొరేట్ల చివరిబ్యాచ్ ఆర్థిక ఫలితాలు కూడా ట్రేడింగ్ దిశను నిర్దేశిస్తాయన్నారు. శుక్రవారం సెన్సెక్స్ 885 పాయింట్లు క్షీణించి 80,982 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 293 పాయింట్ల పతనాన్ని చవిచూసి 24,718 పాయింట్ల వద్ద నిలిచింది.
పరిమిత శ్రేణిలో కన్సాలిడేషన్
భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంఆ ర్‌ఎఫ్ తదితర కార్పొరేట్ల ఫలితాలతో మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా ఆయా షేర్ల కదలికలు ఉండవచ్చని అంచనా వేస్తున్నా మన్నారు. ప్రీమియం విలువలు, బలహీన కార్పొరేట్ ఫలితాలు, ప్రస్తుతం మొదలైన గ్లోబల్ ట్రెండ్ తదితర అంశాల కారణంగా రానున్న రోజుల్లో మార్కెట్ పరిమితశ్రేణిలో కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అంచనా వేశారు. ఆర్బీఐ ఈ దఫా సమీక్షలో యథాతథ వడ్డీ రేట్లను కొనసాగిస్తుందని తాము భావిస్తున్నామని, అయితే భవిష్యత్ రేట్ల కోతపై కొన్ని సంకేతాలు అందించవచ్చని నాయర్ చెప్పారు.
భారత్ సూచీలకు పరీక్షా సమయం
చాలాకాలంపాటు స్థిరంగా ఉన్న గ్లోబల్ మార్కెట్లు తొలిసారిగా బలహీనపడుతున్నాయని, ఇది భారత సూచీల పటిష్టతకు పరీక్షగా భావించవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. గ్లోబల్ ప్రతికూలతలు, అధిక విలువలపై ఆందోళన ఉన్నప్పటికీ, దేశీయ లిక్విడిటీ జోరు, స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కారణంగా ఇప్పటివరకూ భారత్ స్టాక్ సూచీలు పెద్ద కుదుపునకు లోనుకాలేదని మీనా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8న వెల్లడయ్యే ఆర్బీఐ పాలసీ ప్రకటన మార్కెట్ ట్రెండ్‌కు ముఖ్యమైనదని చెప్పారు.