calender_icon.png 7 January, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ ట్రెండ్, ఎఫ్‌పీఐ యాక్టివిటీపె దృష్టి

06-01-2025 12:07:48 AM

ఈ వారం మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు

ముంబై,  జనవరి 3: కొత్త క్యాలండర్ సంవత్సరం ప్రారంభంలోనే పెద్ద ర్యాలీ జరిపిన దేశీయ స్టాక్ మార్కెట్ కదలికల్ని ఈ వారం గ్లోబల్ ట్రెండ్ నిర్దేశిస్తుందని విశ్లేషకులు తెలిపారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలి యో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) ట్రేడింగ్ యాక్టివిటీపై మార్కెట్ దృష్టి నిలిచి వున్నదన్నారు.

అలాగే ఈ వారంలో విడుదలకానున్న యూఎస్ ఫెడ్ మినిట్స్, ఇదేవారంలో మొదలయ్యే క్యూ3 ఫలితాల సీజన్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు వివరించారు.  విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడంతో భారత మార్కెట్‌పై ఒత్తిడి ఏర్పడుతున్నదని, కొత్త ఏడాదిలో వారి వైఖరి ఆధారంగా సమీప భవిష్యత్‌లో ట్రెండ్ ఉంటుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. 

డాలర్-రూపాయి మారకపు రేటు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు కూడా మార్కెట్ దిశను నిర్దేశించే అంశాలేనని పేర్కొన్నారు. క్యూ3 ఫలితాల సీజన్ సమీపిస్తున్నందున కార్పొరేట్లు వెల్లడించే అప్‌డేట్స్ మార్కెట్ ట్రెండ్‌పై ప్రభావం చూపుతాయని సంతోష్ మీనా వివరించారు.

అదేపనిగా పడిపోతున్న రూపాయి విలువను కూడా ఇన్వెస్టర్లు ట్రాక్ చేస్తున్నారని, కరెన్సీ కదలికలు వారి పెట్టుబడి నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. జనవరి 3తో ముగిసిన వారం మొత్తంమీద  మాత్రం సెన్సెక్స్ 524 పాయింట్లు, నిఫ్టీ 191 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. 

సెన్సెక్స్ 79,223 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,005 పాయింట్ల వద్ద ముగిసాయి. గత శుక్రవారం డాలరు మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయి 85.79 వద్ద ముగిసింది.  ఈ బుధవారం యూఎస్ ఫెడ్ డిసెంబర్ సమావేశపు మినిట్స్ వెలువడతాయి.

అంతర్జాతీ య పరిణామాలపై దృష్టిపెడుతూ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దీనితో మార్కెట్‌లో కరెక్షన్లు జరుగుతాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. 

ట్రంప్ 2.0 పై ఫోకస్

కార్పొరేట్ ఫలితాలు సీజన్ నడుస్తున్న సమయంలోనే ట్రంప్ 2.0 పై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న రెండోసారి  పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇప్పటికే చైనా, మెక్సికో, కెనడా తదితర దేశాల దిగుమతులుపై టారీఫ్‌లు విధించనున్నట్టు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ 2.0 యంత్రాంగం తీసుకునే విధానపరమైన చర్యలు,  ప్రపంచ వాణిజ్యంపై వాటి ప్రభావంపై వివిధ అంచనాలు మార్కెట్లను ఒడిదుడుకులకు లోనుచేయవచ్చని అంచనా వేస్తున్నట్లు గౌర్ వివరించారు.

జనవరి నెల తొలి రెండు రోజుల్లో మార్కెట్ కొంత రికవరీ అయినప్పటికీ, వృద్ధి మందగమనం, అధిక స్టాక్ విలువలు, విదేశీ ఫండ్స్ విక్రయాలు, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం యూఎస్ ట్రేడ్ విధానాలపై అనిశ్చితి తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నదని ప్రవేశ్ గౌర్ చెప్పారు.

ఈ వారాం తంలో వెలువడే హెచ్‌ఎస్‌బీసీ సర్వీసెస్ పీఎంఐ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా గమనించే అంశాలని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. 

9న టీసీఎస్ ఫలితాలు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ మూడో త్రైమాసికానికి ఫలి తాల సీజన్ ఈ వారం ప్రారంభం కానుం ది. జనవరి 9న ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యూ3  ఫలితాల్ని వెల్లడిస్తుంది. అదేరోజున మరో టాటా గ్రూప్ ఐటీ కంపెనీ టాటా ఎలక్సి ఫలితాలు కూడా వెలువడతాయి.

యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిబాటలో కొనసాగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి అంశాలతో సాఫ్ట్‌వేర్ కంపెనీల క్యూ3 ఫలితాల పట్ల మార్కెట్లో ఆసక్తి నెలకొన్నది. అలాగే రానున్న త్రైమాసికాలపై ఐటీ కంపెనీలు వెల్లడించే గైడన్స్ కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని విశ్లేషకులు తెలిపారు.

జనవరి 13న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జనవరి 16న ఇన్ఫోసిస్‌లు వాటి మూడవ త్రైమాసిక ఫలితాల్ని ప్రకటిస్తాయి. ఐటీ రంగం పనితీరు క్యూ3లో మెరుగుపడిన సంకేతాలు వాటి ఫలితాలలో కన్పిస్తే, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లో పెట్టుబడులకు ఉపక్రమిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అంచనా వేశా రు.

సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో మెరుగుదల ఉంటుందన్న అంచనాల కారణంగా రానున్న రోజుల్లో క్యూ3 ఫలితాలపై మార్కెట్ దృష్టి ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 

3 రోజుల్లో రూ.4,285 కోట్ల ఎఫ్‌పీఐ విక్రయాలు 

దేశీయ స్టాక్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐలు) విక్ర యాల జోరు పెరిగింది. జనవరి 3తో ముగిసిన వారంలో మార్కెట్ కొంతవరకూ లాభపడినప్పటికీ, జనవరి నెల తొలి మూడు రోజుల్లో ఎఫ్‌పీఐలు భారీగా రూ.4,285 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరం గా విక్రయించినట్లు డిపాజిటరీల గణాంకా లు వెల్లడిస్తున్నాయి. అంతక్రితం వారంలో  ఎఫ్‌పీఐలు రూ.6,200 కోట్లు వెనక్కు తీసుకున్నారు. 

వరుస రెండు నెలల భారీ విక్రయాల అనంతరం డిసెంబర్ నెల తొలి రెండు వారాలో  దేశీయ స్టాక్స్‌లో నికరం గా రూ.22,766 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు మూడోవారం నుంచి అమ్మకాలు ప్రారంభించారు. డిసెంబర్ నెల మొత్తంమీద రూ.15,446 కోట్లు నికరంగా ఇన్వెస్ట్ చేశారు.

డాలర్ పటిష్టంగా ఉంటూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 109 వద్ద, 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 4.5 శాతం ఎగువన ఉన్నదని తెలిపారు. 

రాను న్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు