26-03-2025 12:00:00 AM
హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): నగరంలో అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖతో పాటు, జీహెచ్‌ఎంసీ, హైడ్రాతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇలంబర్తి, ఏవీ రంగనాథ్ సమావేశమాయ్యారు.
రాబోయే వానాకాలంలో వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంలో వరద ముప్పు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ ఎంసీ అధికారులతో ప్రాంతాలవారీగా కమిటీలు వేయాలన్నారు.
ఈ రెండు కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు ఏ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకుని ఆ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.
చెత్త తొలగించేందుకు చర్యలు
నగరంలో అధికారులు గుర్తించిన వరద ముప్పు ఉన్న 141 ప్రాంతాల్లో పరిస్థితి, వరద నివారణకు తీసుకున్న చర్యలపై కమిషనర్లు సమీక్షించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి కల్వర్టులు, నాలాల ద్వారా వరద సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్యాచ్మెంట్ ప్రాంతాలను గుర్తించి వరద దగ్గర్లో చెరువుకు చేరేలా చూడాలని సూచించారు.