07-03-2025 12:42:32 AM
నల్లగొండ/దేవరకొండ, మార్చి 6 (విజయక్రాంతి) : తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనికలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలునాయక్‌తో కలిసి దేవరకొండ డివిజన్‌లో తాగునీరు సరఫరా, ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, ప్రాజెక్టుల భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
దేవరకొండ మున్సిపాలిటీతోపాటు, అన్ని గ్రామాల్లో సరిపడా తాగునీరు సరఫరా చేసేలా మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతూ.. ఏప్రిల్, మేలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి ఫ్లో వాల్వులను తొలగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇలా చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించే ముందు మార్కింగ్ చేసి ఎమ్మెల్యే ద్వారా ప్రారంభించాలని ఎంపీడీఓలకు చెప్పారు. నక్కలగండి ప్రాజెక్టులో భాగంగా ఇల్లు కోల్పోయిన నక్కలగండి తండావాసులకు పరిహారం ఇవ్వలేదని దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.
పెండ్లిపాకల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఇండ్లు నష్టపోయిన వారికి పరిహారం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గుడితండా, కారోబార్ తాండాలో భూసేకరణ సమస్యపై చర్చించారు. అంతకుముందు కలెక్టర్ నల్లగొండ ప్రగతి జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి తనిఖీ చేశారు. నల్లగొండలో ఫుడ్ సేఫ్టీ వాహనాన్ని ప్రారంభించారు.