కాటన్ దిగుబడి అంచనా 25.33 లక్షల టన్నులు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి): పత్తి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ర్టంలో 42.23 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరిగినట్టు ఇప్పటికే వ్యవసాయశాఖ నిర్ధారించగా, 25.33 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
బుధవారం సీసీఐ సీఎండీ, జిన్నింగ్ మిల్లర్లతో సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిల్లర్లను టెండర్‌లో పాల్గొనేలా ఒప్పించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 351 జిన్నింగ్ మిల్లుల్లో 319 మిల్లర్లు టెండర్‌లో పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పత్తి మార్కెట్లకు చేరుకోకముందే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
మిల్లులను నోటిఫైడ్ కేంద్రాలుగా ప్రకటించే అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించామని తెలిపారు. సీజన్ పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీల ఏర్పాటు చేసి, వాటి ద్వారా రాష్ర్టంలో మార్కెటింగ్ సజావుగా జరిగేటట్లు నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ సాఫ్ట్‌వేర్‌లో రైతుల వివరాలను సులువుగా గుర్తించే ఏర్పాటు చేసినట్టు మంత్రికి అధికారులు వివరించారు.
ఈ ఏడాది సులువుగా పత్తి అమ్ముకునేందుకు అదనపు వివరాలను రైతులకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తామని అధికారులు చెప్పారు. దీనికి మంత్రి స్పదిస్తూ రైతులు పంట అమ్ముకునేందుకు ఏ కేంద్రానికి వెళితే త్వరగా విక్రయించుకోవడానికి వీలు అవుతుందో తెలుసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు.
రైతులు సీసీఐకి పత్తి అమ్ముకోవడానికి వెళితే తప్పనిసరిగా ఆధార్‌ను తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. అలాగే ఆధార్‌కు అనుసంధానించిన ఫోన్ నంబర్ కూడా ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని సీసీఐ అధికారులు చెప్పగా 6గంటల వరకు ఉండేలా చూడాలని ఆదేశించారు.
రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధర రూ. 7521 పొందాలన్నారు. ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు తలెత్తితే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.