calender_icon.png 23 September, 2024 | 3:02 AM

సన్నబియ్యం కొనుగోలుపై ఫోకస్

23-09-2024 12:48:23 AM

  1. జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ
  2. ముందుగానే స్టాక్ సిద్ధం చేసుకునేందుకు ప్లాన్
  3. యాసంగిలో భారీగా సాగు చేసేలా అవగాహన
  4. 500 బోనస్‌పై ప్రచారం చేయనున్న అధికారులు  

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సన్నబియ్యం కొనుగోళ్లపై పౌరసరఫ రాల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో కూడా రేషన్‌కార్డులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మధ్యాహ్నా భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతిగృహాలకు సరఫరా చేస్తుంది. దీంతో సరిపడా నిల్వలు ఉంచేందుకు ముందుస్తు ప్రణాళికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకోసం 39 లక్షల మెట్రిక్  ధాన్యం సేకరణ టార్గెట్ పెట్టుకుంది.

గతేడాది రెండు సీజన్లలో 21లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సేకరించింది. తక్కువగా సేకరించడంతో ఇకా నుంచి మిల్లర్లు తమ వద్ద  ఉన్న సన్నవడ్ల నిల్వలు పూర్తిగా ప్రభుత్వానికి ఇవ్వాలని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. గతంలో వ్యవహరించిన విధంగా ఇతర రాష్ట్రాలకు అమ్మకాలు చేయవద్దని, ప్రస్తుతం వారివద్ద  ఉన్న స్టాక్ వివరాలను జిల్లా అధికారులు తెలియజేయాలని సూచించారు. సంక్షేమ విద్యాసంస్థలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం, ఐసీడిఎస్‌లకు  ప్రతి ఏటా 2.92 లక్షల టన్నుల సన్న బియ్యం సరపరా చేస్తుంది. ప్రస్తుతం ఆహారభద్రత కార్డులు రాష్ట్రంలో 89.96లక్షల ఉండగా 2.81లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. వీరికి 21.67లక్షల టన్నుల బియ్యం అవసరం కానుంది. 

 సాగుపై అవగాహన సదస్సులు..   

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దొడ్డు రకం వరి కంటే సన్నవరి సాగు చేస్తే వచ్చే లాభాలు, దిగుబడి వంటి అంశాలను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తారు. సన్నవడ్లకు రూ. 500 బోనస్‌తో పాటు కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు పడకుండా త్వరగా తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామనే ప్రచారానికి సిద్ధ మవుతున్నట్లు చెప్పారు. యాసంగి సీజన్‌లో సుమారు 25 లక్షల ఎకరాల్లో సన్న వరి సాగు చేసేందుకు ప్రయత్నాలు చేస్త్నునారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతామని చెబుతున్నారు. 

సాయం అందిస్తే రైతులు మొగ్గు.. 

రైతులు సన్న వరి సాగుచేసేందుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పంపిణీతో పాటు బ్యాంక్‌లో పంట రుణాలు కూడా ఎకరానికి రూ. 30వేల వరకు ఇస్తే సాగు చేసేం దుకు ముందుకు వస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం విత్తనాలు, ఎరువులతో పాటు దినసరి కూలీల ఖర్చులు పెరిగాయని, వీటిని తట్టుకోవాలంటే పెట్టుబడి సమయంలో ప్రభుత్వం ఆదుకుంటే సన్నవరి చేసేందుకు తమకు ఇబ్బందులు లేవని వెల్లడించారు.