calender_icon.png 19 October, 2024 | 3:54 PM

బడ్జెట్, గ్లోబల్ ట్రెండ్స్‌పై దృష్టి

22-07-2024 12:05:00 AM

 ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల మాట

న్యూఢిల్లీ, జూలై 21: కొద్ది వారాలుగా  వరుస రికార్డులతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్‌కు కీలకమైన బడ్జెట్ వారం వచ్చేసింది. జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల దృష్టి ఉందని, దీనితో పాటు ప్రపంచ మార్కెట్లు కుదుపునకు లోనవుతున్నందున గ్లోబల్ ట్రెండ్స్ కూడా ఈ వారం మార్కెట్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెప్పా రు. మరోవైపు క్యూ1 ఫలితాలు కూడా మార్కెట్లకు హెచ్చుతగ్గులకు లోనుచేస్తాయన్నారు. 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు, రూపాయి ట్రెండ్, బ్రెంట్ క్రూడ్ ధర కదలికలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని అంటున్నారు. ‘మార్కెట్‌ను మలుపుతిప్పేది ముఖ్యంగా జూలై 23నాటి కేంద్ర బడ్జెట్. వృద్ధి ఆధారిత విధానాలు ఉంటాయన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఈ అంచనాలకు తగిన రీతిలో బడ్జెట్ ఉంటుందా, లేదా అన్నదే పాయింట్’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ వ్యా ఖ్యానించారు.

కార్పొరేట్ ఫలితాలతో పాటు బడ్జెట్ ముందస్తు అంచనాలు మార్కెట్‌ను ఒడిదుడుకులకు గురిచేయవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. శుక్రవారం 81,587 పాయింట్ల రికార్డు గరిష్ఠస్థాయిని నమోదుచేసిన సెన్సెక్స్ చివరకు 80,604 పాయింట్ల వద్ద ముగిసింది.  నిఫ్టీ సైతం 24,854 పాయింట్ల వద్ద రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం 24,531 పాయింట్ల వద్ద నిలిచింది. గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 85 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీ సెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.  

క్యూ1 ఫలితాలు

గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాలకు ఈ సోమవారం తొలుత మార్కెట్ స్పందన ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల మందకొడితనం కారణంగా రిలయన్స్ నికరలాభం, ఆదాయాలు మార్కెట్ అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఆర్‌ఐఎల్ లాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 5 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. అలాగే శనివారం ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు కూడా సోమవారం ఫోకస్‌లో ఉంటుందన్నారు. ఈ బ్యాంక్ నికరలాభం గత ఏడాది క్యూ1తో పోలిస్తే పెరిగినప్పటికీ, స్వీక్వెన్షియల్‌గా తగ్గి రూ.16,475 కోట్లుగా నమోదయ్యింది. అలాగే శనివారం ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు కూడా సోమవారం ఫోకస్‌లో ఉంటుందన్నారు. ఇక ఈ వారం ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు హిందుస్థాన్ యూనీలీవర్, నెస్లే ఫలితాలు మార్కెట్లకు కీలకమేనని ప్రవేశ్ గౌర్ తెలిపారు. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.30,772 కోట్లు

జూలై నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లో రూ.30,772 కో ట్ల నికర పెట్టుబడులు చేశారు. కేం ద్రం విధాన సంస్కరణల్ని కొనసాగిస్తుందన్న ఆశలు, గరిష్ఠ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందన్న అంచనాలు, అంచనాలకంటే మెరు గ్గా వెల్లడైన ఐటీ కంపెనీల ఫలితాలు పెట్టుబడులకు కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బాండ్లు, డాలర్ బలహీనత కొనసాగితే రాను న్న రోజుల్లోనూ విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లో కొనుగోళ్లు జరుపుతారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.