calender_icon.png 10 October, 2024 | 7:59 AM

ఒడిదుడుకుల ట్రేడింగ్

28-08-2024 12:30:00 AM

కొత్త గరిష్టం వద్ద ముగిసిన నిఫ్టీ

ముంబై, ఆగస్టు 27: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వడ్డీ రేట్లు తగ్గించనన్నట్టు చేసిన ప్రకటనతో సోమవారం పెద్ద ర్యాలీ జరిపిన స్టాక్ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు దాదాపు ఫ్లాట్‌గా ముగి సాయి.  ఇంట్రాడేలో 81,919 పాయింట్లు, 81,600 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు  13 పాయింట్లు లాభంతో 81,711 పాయింట్ల వద్ద  ముగిసింది. ఈ సూచీ పెరగడం వరుసగా ఇది ఆరో రోజు. 

ఇదేబాటలో వరుసగా తొమ్మిదో రోజూ అప్‌ట్రెండ్ సాగించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి  25,017 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం ఇదే ప్రధమం. రికార్డు గరిష్ఠస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని, దీనితోనే కొంత ఒడిదుడుకులు నెలకొన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారన్నారు. మెటల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరగ్గా, టెలికం, టెక్నాలజీ, ఐటీ షేర్లు నిలదొక్కుకున్నాయని ట్రేడర్లు తెలిపారు.

ఇటీవల దేశీయ మార్కెట్ పట్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) వైఖరి మార్చుకోవడం, ఫెడ్‌కు అనుగుణంగా రిజర్వ్‌బ్యాంక్ సైతం ద్రవ్య విధానాన్ని సడలిస్తుందన్న అంచనాల కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్లు పాజిటివ్‌గా ఉంటాయని నాయర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.84 శాతం పెరిగి 80.75 డాలర్ల వద్దకు పెరిగింది. సోమవారం రూ.483 కోట్ల నికర పెట్టుబడులు చేసిన ఎఫ్‌పీఐలు మంగళవారం మరో రూ.1,503 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 1.13 శాతం పెరిగింది. టెక్నాలజీ ఇండెక్స్ 0.70 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.68 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.44 శాతం చొప్పున పెరిగాయి. కన్జూమర్ డ్యూరబు ల్స్, పవర్, కమోడిటీ, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.58 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.50 లాభపడింది.

బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్ 2.07  శాతం పెరిగి రూ.1,686 వద్ద ముగిసింది. తదుపరి మారుతి సుజుకి 2.04 శాతం లాభపడింది. లార్సన్ అండ్ టుబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2 శాతం వరకూ పెరిగా యి.  మరోవైపు హిందుస్థాన్ యూనీలివర్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ షేర్లు 2.2 శాతం వరకూ నష్టపోయాయి.