calender_icon.png 14 October, 2024 | 3:50 PM

ఆద్యంతం ఒడిదుడుకులే

20-08-2024 12:30:00 AM

స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, లాభాల్లో నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు ఈ వారంలో వెలువడనున్న యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ వివరాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటించారు. దీంతో ఈ రోజు ట్రేడింగ్‌లో తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొన్న సూచీలు చివరికి మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ స్వల్పంగా పెరిగింది. ఉదయం 80,680 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ కాస్సేపటికే నష్టాల్లోకి జారుకుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆద్యంతం ఊగిసలాడింది.

ఒక దశలో 80,332 పాయింట్ల ఇంట్రాడే కనిష్టానికి పడిపోయిన సూచీ చివరికి 12.6 పాయింట్ల స్వల్ప నష్టంతో 80,424.68 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 24,52224,638 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 31.50 పాయింట్ల స్వల్పలాభంతో ముగిసింది. డాలరుతో రూపాయి విలువ 8 పైసలు పెరిగి 83.87గా ముగిసింది. ఆటో, బ్యాంకింగ్ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, భారత్ పెట్రోలియం, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్‌టీఐ, మైండ్‌ట్రీ రాణించగా మహీంద్రా, మహీంద్రా, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ షేర్లు నష్టపోయాయి.